డిజిటల్‌.. కాలేజ్‌ | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌.. కాలేజ్‌

Aug 20 2026 2:52 AM | Updated on Aug 20 2026 2:52 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సాంకేతిక విద్య

కంప్యూటర్‌ ల్యాబ్‌లకు నిధులు మంజూరు

జిల్లాలో నాలుగు ఎంపిక

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఇక డిజిటల్‌మయం కానున్నాయి. సాంకేతిక విద్య కు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా కళాశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. వీటితో ఇతర సాంకేతిక పరికరాలు, విద్యుత్‌, నెట్‌వర్కింగ్‌ తదితర వసతులు సమకూర్చనున్నారు.

నాలుగు కళాశాలల్లో ల్యాబ్‌లు..

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్షా వార్షిక ప్రణాళిక 2026–27లో భాగంగా రాష్ట్రంలోని 80 సర్కారు జూనియర్‌ కాలేజీల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని బోథ్‌, బేల, ఉట్నూర్‌తో పాటు ఆదిలాబాద్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని 80 కళాశాలలకు మొత్తం రూ.20 కోట్లు కేటాయించగా, ఒక్కో కళాశాలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ లెక్కన జిల్లాకు రూ.కోటి మంజూరయ్యాయి.

ప్రాక్టికల్స్‌తో నైపుణ్యాలు మెరుగు..

కంప్యూటర్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే విద్యార్థులు పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్‌ ఆపరేషన్‌, ఇంటర్నెట్‌ వినియోగం, డిజిటల్‌ టెక్నాలజీతో పాటు వివిధ సాఫ్ట్‌వేర్‌లపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకునే అవకాశం కలగనుంది. తద్వారా విద్యార్థుల్లో డిజిటల్‌ నైపుణ్యాలు పెరగడంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో పోటీ పడేందుకు అవసరమైన సామర్థ్యం మెరుగుపడుతుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ల్యాబ్‌ల ఏర్పాటుకు సంబంధించిన పనులను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీటి ఏర్పాటుతో కళాశాలల్లో సాంకేతిక విద్యకు మరింత ప్రాధాన్యం లభించడంతో పాటు విద్యార్థులకు ఆధునిక విద్యా వనరులు అందుబాటులోకి రానున్నాయి.

గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం

ప్రస్తుతం ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షల్లో కంప్యూటర్‌ పరిజ్ఞానం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. ఇప్పటికే సర్కా రు కళాశాలల అభివృద్ధి కోసం గతేడాది ల్యాబ్‌లు, ఫేషియల్‌ అటెండెన్స్‌, ఫర్నిచర్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది.

జిల్లాలో

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 13

ఫస్టియర్‌ విద్యార్థులు 3,404

సెకండియర్‌ విద్యార్థులు 3,214

కంప్యూటర్‌ విద్యకు ఎంపికై న కళాశాలలు 04

ఒక్కో కళాశాలకు మంజూరైన

నిధులు రూ.25లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement