ఆదిలాబాద్‌టౌన్: పోలీసు వ్యవస్థ బాధితుల పక్షాన ఉండి వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 33 మంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, ప్రతీ ఫిర్యాదును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల సమస్యలపై సత్వరమే దర్యాప్తు చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు, నేరాలకు సంబంధించిన సమాచారం ఉన్నా 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.


