అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు తలెత్తొద్దు ‘సర్’ ఫేజ్–2లో సమర్థవంతంగా వ్యవహరించాలి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం అవసరం ఉట్నూర్‌లో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా పీఏసీ సమావేశం హాజరైన ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఇన్‌చార్జి మంత్రి ‘జూపల్లి’ ‘హస్తం’ శ్రేణులకు నేతల దిశానిర్దేశం
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్‌రూరల్: అర్హులైన ఓటర్ల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి.. సర్ ఫేజ్–2లో పార్టీ మండల అధ్యక్షులు, బీఎల్‌ఏ–2ల ద్వారా పూర్తిగా సమీక్షించాలని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని జీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల పీఏసీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ‘సర్’, పార్టీ కమిటీల నియామకాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. పలు అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సమర్థవంతంగా పర్యవేక్షించాలి..
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల, తొలగింపునకు గురయ్యే ఓటర్లపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో సర్ ఫేజ్–2 ప్రక్రియలో పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పర్యవేక్షించి అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్య నేతలు పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో పట్టణ, డివిజన్, మండలస్థాయి కాంగ్రెస్ కమిటీల నియామకాలు, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. ఆగస్టు 31లోగా అన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలపై సమీక్షించారు. కాల పరిమితితో పూర్తి చేయాలని చెప్పారు. పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
నామినేటెడ్ పదవులపై చర్చ..
జిల్లాలోని కాంగ్రెస్ నాయకులతో నామినేటెడ్ పదవులపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పనిసరిగా గుర్తింపునిస్తామని ముఖ్య నేతలు పేర్కొన్నారు. అటువంటి వారికే కమిటీలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ, ఆ పార్టీ చేస్తున్న మతతత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టడానికి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పీఏసీ కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.
సమావేశంలో ఉమ్మడి జిల్లా నేతలు పాల్గొన్నారు. ఇందులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, ఆత్రం సుగుణ, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్, సాజిద్‌ఖాన్, గండ్రత్ సుజాత, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, ఓబీసీ విభాగం అధ్యక్షుడు అశోక్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పరమేశ్వర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చరణ్‌గౌడ్, ఆయా జిల్లాల కాంగ్రెస్ పీఏసీ సభ్యులు తదితరులు ఉన్నారు.
కంది వర్సెస్ సంజీవ్‌రెడ్డి
సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్‌రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం ప్రారంభం కాగానే.. అర్హత లేని నేతలను పీఏసీ సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని కంది ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వీడిన నేతలను ఎలా పిలుస్తారని పేర్కొన్నారు. అధిష్టానం ఆహ్వానం మేరకే వచ్చామని కందితో సంజీవరెడ్డి వాగ్వాదానికి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఇన్‌చార్జి మంత్రి జూపల్లి సమక్షంలోనే ఈ గలాట చోటుచేసుకుంది. ఆ తర్వాత సంజీవ్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇరువురు నేతల వర్గీయుల వాగ్వాదంలో ముఖ్య నేతల ముందే పరుష పదజాలం ఉపయోగించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ విషయంలో ముఖ్య నేతలు జిల్లా నేతలతో పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి షోకాజు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై పీఏసీ సమావేశంలో చర్చించారు. ప్రజలకు వివరించడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ పరిధిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలు, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు.


