ఆదిలాబాద్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రూ.2 లక్షలకు పైగా రుణాలున్న రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మాఫీ కాలేదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరకపోవడంతో రైతులకు పంట నష్టం సమయంలో భరోసా దక్కడం లేదన్నారు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించడంలోనూ సర్కారు విఫలమైందని, ఆత్మ కమిటీ చైర్మన్ల నియామకాలను సైతం రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇందులో నాయకులు రాందాస్, దయాకర్, కార్తీక్, సన్నీ, కరుణాకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


