అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

Aug 16 2026 12:27 AM | Updated on Aug 16 2026 12:27 AM

● అర్హులందరికీ సంక్షేమ పథకాలు ● త్వరలోనే యంగ్‌ ఇండియా స్కూళ్లు ● కీలకం కానున్న ఆదిలాబాద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ● భూ సర్వేరికార్డుల నిర్వహణతో శాశ్వత రక్షణ ● పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

● అర్హులందరికీ సంక్షేమ పథకాలు ● త్వరలోనే యంగ్‌ ఇండియా స్కూళ్లు ● కీలకం కానున్న ఆదిలాబాద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ● భూ సర్వేరికార్డుల నిర్వహణతో శాశ్వత రక్షణ ● పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

మాట్లాడుతున్న

షబ్బీర్‌ అలీ

పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న షబ్బీర్‌ అలీ

సాక్షి, ఆదిలాబాద్‌: రాష్ట్రంతో పాటు ఆదిలాబాద్‌ జిల్లా సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించడమే ఈ ప్రభుత్వ ఏకై క లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో శనివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. విద్యార్థుల సాంస్క్రృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, అనిల్‌ జాదవ్‌, కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఏఎస్పీ మౌనిక, మున్సిపల్‌, మార్కెట్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌లు చైర్‌పర్సన్‌ బండారి అనూష, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

స్మార్ట్‌కార్డుల పంపిణీ షురూ

ల్యామినేటెడ్‌ రేషన్‌ స్మార్ట్‌కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 2,26,733 కుటుంబాలకు పంపిణీ చేస్తాం. ఇప్పటి వరకు నూతనంగా 37,420 కొత్త రేషన్‌కార్డులను 46,098 మంది కొత్త యూనిట్లను నమోదు చేశాం. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.500కే సిలిండర్‌ అందిస్తూ ఇప్పటి వరకు రూ.19.20 కోట్ల సబ్సిడీని వారి ఖాతాల్లో జమచేశాం. రూ.24.70 కోట్లతో తొమ్మిది నూతన సబ్‌స్టేషన్ల పనులు, రెండేళ్లలో 3,410 వ్యవసాయ కనెక్షన్లు, సీఎం గిరివికాసం ఎస్సీ కార్పొరేషన్‌, డీఏజేజీయూఏ పథకాల ద్వారా అంగన్‌వాడీలు, నిరుపేదల ఇళ్లకు నిరంతర విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తున్నాం.

ఉత్తర తెలంగాణ అభివృద్ధికే కీలకమైలురాయి

ఆదిలాబాద్‌ అభివృద్ధిలో చారిత్రాత్మకమైన జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,278.14 కోట్ల పరిపాలన ఆమోదం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 2009.23 ఎకరాల భూమిని సేకరిస్తున్నాం. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ ద్వారా ఆదిలాబాద్‌ కు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం వృద్ధి చెందుతాయి. ఇది ఉత్త ర తెలంగాణ అభివృద్ధికి కీలకమైలురాయిగా నిలు వనుంది. జిల్లా అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భోరజ్‌ మండలంలో 2,062.01 ఎకరాల్లో ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మావలలో రూ.40 కోట్లతో నిర్మాణం పూర్తయిన ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఐటీ రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో జిల్లా ఆర్థిక ప్రగతి మరింత వేగవంతమవుతుంది.

సొంతింటి కల సాకారం..

బడుగు, బలహీనవర్గాల సొంతింటి కల సాకారం అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తొలి రెండు విడతల్లో 21,767 ఇళ్లు కేటాయించగా 14,772 నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 3,605 పూర్తయ్యాయి. దశలవారీగా రూ.311.36 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశాం. మావల, కేఆర్‌కే కాలనీల్లో 934డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.చేయూత ఫించన్‌ పథకంలో భాగంగా దరఖాస్తులను ఈనెల 31వరకు స్వీకరించనున్నాం. అర్హులందరికీ పింఛన్‌ అందజేస్తాం. రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు భరోసా కోసం 61,121 మంది రైతులకు రూ.327.92 కోట్లు విడుదల చేశాం.

వైద్యసేవలు మెరుగు..

బోధన విధానం ఇతర అంశాలు ప్రామాణికంగా ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో రిమ్స్‌ వైద్య కళాశాల జాతీయ స్థాయిలో 139, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఎంబీబీఎస్‌ సీట్లను 150కి పెంచాం. నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణానికి రూ.40 కోట్ల , ఉట్నూర్‌, బోథ్‌ ఆ సుపత్రుల నవీకరణకు రూ. 41.70 కోట్ల నిధులు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. 380 మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాం.

తెలంగాణ జలసిరి..

జల సంరక్షణ పనుల అమలులో దక్షిణ భారతదేశంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రపతి ప్రశంసతో పాటు రూ.2కోట్ల నగదు బహుమతిని గెలుచుకుంది. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను అధిగమించి ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని రూపొందించి గ్రామసంఘాలను సమన్వయం చేశాం. ఇందులో భాగంగా జిల్లాలో రూ.88.17 కోట్ల అంచనా వ్యయంతో 94,600 ఇంకుడుగుంతలు, 1786 పంట కుంటలు, 40 ఊట కుంటలు, 6270 బోర్‌బావుల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. వీబీ–జీరాంజీ ద్వారా జాబ్‌కార్డు కలిగిన ఉపాధి కూలీలకు 31.37లక్షల పనిదినాలు కల్పించి రూ.86.65 కోట్లు చెల్లించాం.

భూ సర్వే రికార్డుల ప్రక్షాళన..

జిల్లా అభివృద్ధి కోసం భూసర్వే రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ వేగంగా చేపడుతున్నాం. రైతుల భూములకు శాశ్వత రక్షణ, కచ్చితమైన హక్కులు కల్పించే దిశగా సమగ్ర భూరీసర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుంది. ప్రణాళిక, ప్రణాళికేతర నిధులు రూ.132 కోట్ల వ్యయంతో సుమారు 146 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మరమ్మతులు పూర్తయ్యాయి. హ్యామ్‌ పథకం కింద 175కిలోమీటర్ల రహదారులకు రూ.323.79 కోట్లు మంజూరై టెండర్‌ దశలో ఉన్నాయి. ఆదిలాబాద్‌ పట్టణ అభివృద్ధికి యూఐడీఎఫ్‌ కింద రూ.17.94 కోట్లతో 50పనులు, టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.10.50 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు మంజూరై పురోగతిలో ఉన్నాయి. వివిధ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ జరుగుతుంది.

ఆదిలాబాద్‌: వేడుకల్లో భాగంగా పరేడ్‌ మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికల కళాశాల విద్యార్థినులు సంప్రదాయ చీరకట్టులో నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అలాగే తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాల– బంగారిగూడ విద్యార్థులు మేరీ భారత్‌ కి భేటి పాటకు నృత్యం చేసి ఔరా అనిపించారు. జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌ కేజీబీవీ పాఠశాల, కళాశాల విద్యార్థినులు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ చేసిన నృత్య ప్రదర్శనకు కరతాళధ్వనులు ప్రతిధ్వనించాయి. గెజిటెడ్‌ ఉన్నత పాఠశాల నంబర్‌ వన్‌కు చెందిన విద్యార్థినులు ప్రభుత్వం నూతనంగా అందించిన యూనిఫాంతో ‘సబ్‌సే ఆగే హై హిందుస్తానీ’ అంటూ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. భుక్తాపూర్‌ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గోండి వేషధారణలో నృత్యం చేసి ఆదివాసీ సాంస్కృతిక వైభవాన్ని చాటారు. అనంతరం చిన్నారి కళాకారులకు ముఖ్య అతిథులు, అధికారులు జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

ఆకట్టుకున్న స్టాల్స్‌..

వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను షబ్బీర్‌ అలీ ప్రారంభించారు. కలెక్టర్‌ తో కలిసి వాటిని పరిశీలించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement