కైలాస్‌నగర్: కుటుంబానికి ఆధారమైన ఇంటిపెద్ద ఆకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు పడే బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లోనైతే రోడ్డున పడే పరిస్థితి. ఇలాంటి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (ఎన్‌ఎఫ్‌బీఎస్)ను అమలు చేస్తోంది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారణ చేపట్టి అర్హులైన వారికి రూ.20వేలను తక్షణ సాయంగా అందజేస్తారు. అయితే, దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేక అర్హత ఉండీ కూడా చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారు. అర్హులైన మరింత మందికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు బాధ్యతలను ఇటీవల రెవెన్యూశాఖ నుంచి ఎంపీడీవోలకు అప్పగించింది.
వీరికే పథకం వర్తింపు
దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లో సంపాదించే పురుషుడు లేదా మహిళ సహజ మరణం పొందినా ఈ పథకం వర్తిస్తుంది. మరణించిన వ్యక్తి వయస్సు 18నుంచి 59 ఏళ్లలోపు ఉండాలి. ఇందు కు దరఖాస్తు చేసేవారు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, మ రణ ధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్‌కార్డు లేదా ఆహా రభద్రత కార్డు, ఆధార్‌కార్డు జతచేయాలి. దరఖా స్తుదారు ఆధార్‌కార్డు, పాస్‌పోర్టుసైజ్ ఫొటో, ఇన్ కం సర్టిఫికెట్‌తోపాటు వినియోగంలో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ జత పరచాలి. అన్ని మీసేవ కేంద్రాలు లేదా ఆన్‌లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అమలు బాధ్యతల మార్పు
ఎన్‌ఎఫ్‌బీఎస్ అమలులో జాప్యం లేకుండా బాధితులకు సత్వర ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల్లో మార్పు చేసింది. ఇదివరకు రెవెన్యూశాఖ (తహసీల్దార్లు/ఆర్డీవో) పరిధిలో ఉండగా తాజాగా మండల స్థాయిలో ఎంపీడీవోలు, పట్టణ పరిధిలో మున్సిపల్ కమిషనర్లకు దీని బాధ్యతలు అప్పగించారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (డీఆర్డీవో) నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఇందుకోసం ఆయా స్థాయిల్లో ప్రత్యేక వెబ్ పోర్టల్ లాగిన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
151 కుటుంబాలకు లబ్ధి
జిల్లాలో ఈ పథకం కోసం 404 దరఖాస్తులు అందగా ఇందులో ఎంపీడీవోలు 271 ఆమోదించారు. మ రో 133 దరఖాస్తులు ఆమోదించాల్సి ఉంది. డీఆర్డీ వో 210 దరఖాస్తులు ఆమోదించారు. సరైన పత్రాలు లేకపోవడం, నిబంధనల ప్రకారం లేని 52 తిరస్కరించారు. మరో ఏడు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. డీఆర్డీవో ఆమోదించిన 210 దరఖాస్తుల్లో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ 163 ఆమోదించారు. మరో 42 పరిశీలనలో ఉన్నాయి. కాగా, 151 కు టుంబాలకు రూ.20వేల చొప్పున రూ.30.20లక్షలు మంజూరు కాగా, బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.
జిల్లాలో పథకం వివరాలు
వచ్చిన దరఖాస్తులు 404
మంజూరైనవి 151
పెండింగ్ దరఖాస్తులు 42
తిరస్కరణకు గురైనవి 3
సద్వినియోగం చేసుకోవాలి
నిరుపేద కుటుంబాలకు ఎన్‌ఎఫ్‌బీఎస్ ఎంతో అండగా ఉంటుంది. అర్హులైన వారు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తక్షణసాయంగా రూ.20వేల ఆర్థికసాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమవుతుంది. అర్హులైన ఆహారభద్రత కార్డు కలిగిన నిరుపేద కుటుంబాలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పథకంపై అవగాహన కల్పించాలి.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం


