కై లాస్‌నగర్: సిలబస్‌పై స్పష్టత కలిగి ప్రణాళికతో చదివితేనే కొలువు సాధ్యమని ప్రముఖ పోటీ పరీక్షల నిపుణుడు, విద్యావేత్త డాక్టర్ ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధులవుతున్న నిరుద్యోగ యువతకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎస్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఉచిత అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ కొలువుల సాధనకు ఏ విధంగా సన్నద్ధులవ్వాలి, ప్రణాళిక ఎలా ఉండాలి, సిలబస్ ఏ విధంగా చదవాలి, శిక్షణలో నేర్చుకునే అంశాలను ఎలా రివిజన్ చేయాలనే పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో కొలువులు సాధించాలంటే స్పష్టమైన ప్రణాళిక ఉండాలని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించిన సిలబస్‌పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శిక్షణ కాలం నుంచి పరీక్షలు ముగిసేదాకా సెల్ ఫోన్, ఇంటర్నెట్ సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలని తెలిపారు. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసేలా ఎప్పటికప్పుడు కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ఎన్ని మార్కులు వస్తాయనే దానిపై ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకోవాలని తెలిపారు. తద్వారా వెనుకబడిన అంశాలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల కలలు సాకారం చేసేలా ముందుకు సాగాలని సూచించారు. శిక్షకులు రమణగౌడ్, పురుషోత్తంరెడ్డి, సాయికృష్ణ, ప్రశాంత్ తదితరులున్నారు.


