కై లాస్‌నగర్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో డీలర్లకు అవస్థలు తప్పడం లేదు. ఆదిలా బాద్ ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ఆయా దుకాణాలకు చేరాల్సిన బియ్యం పంపిణీ ప్రక్రియ శుక్రవారం నిలిచిపోయింది. పర్యవేక్షించాల్సిన ఓ జిల్లా స్థాయి అధికారి ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జితో పాటు బియ్యంను లారీల్లో నింపాల్సిన హమాలీలపై దురుసుగా వ్యవహరించడంతో వారు డీలర్లకు బియ్యం అందించకుండా గోదాంను మూసివేశారు. సదరు అధికారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశా రు. మరోవైపు బియ్యం కోసం అక్కడికి చేరుకున్న డీలర్లు గోదాం మూసి ఉంచడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు అధికారితో పాటు సివిల్ సప్‌లై డీఎం సుధారాణి, డీఎస్‌వో నందిని గోదాంకు చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎస్ ఇన్‌చార్జితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. సర్ది చెప్పడంతో సాయంత్రం 4గంటల తర్వాత బియ్యం సరఫరా తిరిగి పునరుద్ధరించారు.


