పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా..
క్షేత్రస్థాయిలో కమిటీల పునర్‌వ్యవస్థీకరణ
పూర్తయిన సంఘటన్ శ్రీజన్ అభియాన్
మండల స్థాయిలోనూ పీఏసీ కమిటీలు
సాక్షి,ఆదిలాబాద్: క్షేత్రస్థాయి బలోపేతంపై హస్తం పార్టీ దృష్టి సారించింది. సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 21 మందితో మండలస్థాయి కమిటీ.. పది నుంచి 15మందితో మండల స్థాయిలోనూ పొలిటికల్ ఎఫైర్ (పీఏసీ) కమిటీల నియామకం పూర్తి చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యూత్, మహిళ, ఎన్‌ఎస్‌యూఐ విభాగాలను పూర్తిస్థాయిలో నియమించడం ద్వారా మండల స్థాయిలో ఓ వంద మంది ముఖ్య నాయకులను గుర్తించింది. గ్రామ పోలింగ్ బూత్‌స్థాయిలో కమిటీలు వేసి కార్యకర్తలందరికీ బాధ్యత అప్పగించడం.. మొత్తంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలంతా కలిసి వెయ్యి మందితో ఆ మండలంలో పటిష్ట క్యాడర్‌ను రూపొందించే ప్రక్రియ పూర్తి చేసి కాంగ్రెస్ మార్క్ వ్యూహాన్ని ప్రదర్శించింది.
సంఘటన్ శ్రీజన్ అభియాన్ ద్వారా..
సంఘటన్ శ్రీజన్ అభియాన్ అనేది భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన కార్యక్రమం. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత పునర్ నిర్మాణం, బలోపేతమే లక్ష్యం. కొత్తగా పునర్ నిర్మించే ప్రత్యేక కార్యక్రమంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం, మండల స్థాయిలో బలమైన నాయకత్వాన్ని, కమిటీలను ఏర్పాటు చేయడం, కార్యకర్తలకు గుర్తింపు, వారికి తగిన పదవులు, బాధ్యతలు అప్పగించడం, పారదర్శకమైన ఎంపిక, యువత, మహిళలకు ప్రాధాన్యత, విస్తృత అవకాశాలు కల్పించడం ద్వారా హస్తం పార్టీని బలోపేతం చేయడమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. వీటన్నింటి ద్వారా ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం, వారి తరఫున గొంతు విప్పడమే ధ్యేయం. సంఘటన్ శ్రీజన్ అభియాన్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ గురువారంతో జిల్లాలోని అన్ని మండలాల్లో పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్, ముఖ్య నేతలు అల్లూరి సంజీవ్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు బెజ్జంకి అనిల్ కుమార్‌లు ప్రతి మండలంలో పర్యటించి ఈ కార్యక్రమం ద్వారా మండల కమిటీలన్నింటిని పూర్తి చేశారు. ఇదివరకే మండల అధ్యక్షులను నియమించిన పార్టీ, ఇప్పుడు ఆ కమిటీలను కూడా పూర్తి చేసింది. వీటితో పాటు అనుబంధ సంఘాలు, గ్రామ, పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు అన్నింటిని పటిష్ట పరుస్తున్నారు.
మండల స్థాయిలోనూ పీఏసీ కమిటీ..
కాంగ్రెస్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) అనేది గతంలో కేవలం రాష్ట్రస్థాయిలోనే ఉండేది. ఇటీవల జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించడం, తదనుగుణంగా జిల్లాలోనూ ముఖ్య నాయకులతో ఈ కమిటీని ఇదివరకే ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం, జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా స్థాయి పీఏసీ కమిటీ చర్చించిన తర్వాత దాన్ని పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. ఇలా జిల్లా స్థాయిలో ఈ కమిటీకి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ మండల స్థాయిలోనూ పీఏసీ కమిటీలను ఏర్పాటు చేసింది. సంఘటన్ శ్రీజన్ అభియాన్ ద్వారా ఈ కమిటీలను పూర్తి చేసింది. మొత్తంగా మండల స్థాయిలో కమిటీ, పీఏసీ, అనుబంధ సంఘాల ద్వారా ముఖ్య నాయకులను గుర్తించడం, వారికి ఆ మండలంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయడం ద్వారా పార్టీ సముచిత లక్ష్యంతో ముందుకు కదులుతుంది. రానున్న ఎన్నికలకు రేసులో నిలిచేందుకు మండల స్థాయిలో అన్ని విభాగాల్లో పటిష్టంగా రూపొందిస్తున్నారు.


