మద్దిపాడు: స్థానిక కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎంఈఓ–1గా బల్లికురవ మండలానికి ఎఫ్‌ఏసీగా పదోన్నతి పొందిన లక్ష్మీనారాయణకు శుక్రవారం పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాల్యాద్రి మాట్లాడుతూ లక్ష్మీనారాయణ పరిపాలనానుభవం, నాయకత్వం బల్లికురవ మండలంలో విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సుబ్బారావు, శ్రీనివాసరాయల్, మస్తాన్‌బీ, బీ శ్యాంప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని లక్ష్మీనారాయణకు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.
సంతనూతలపాడు (చీమకుర్తి): జిల్లాలోని మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంతనూతలపాడు మండలంలోని ఎండ్లూరు మహిళా ప్రాంగణం మేనేజర్ మాధవి, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి 45 సంవత్సరాల వయసున్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9963005209 సెల్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
చీమకుర్తి: చీమకుర్తిలోని హరిహరక్షేత్రంలో వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని శాకంబరీదేవిగా శుక్రవారం అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ ధర్మకర్త శిద్దా లక్ష్మీపద్మావతి ఆధ్వర్యంలో అమ్మవారికి సారె, 108 రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని పార్వతీ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. చీమకుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు, శిద్దా కుటుంబీకులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు స్వీకరించారు.
టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం జరిగిన వేలంలో పొగాకు కనిష్ట ధర రూ.160కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది పొగాకు ధరలు తగ్గుతున్నాయే తప్పా ఒక్క రూపాయి కూడా పెరిగిన దాఖలాలు లేవని, అసలు పొగాకు ధరలపై అటు ప్రభుత్వం ఇటు బోర్డు అధికారులు దృష్టి పెట్టడం లేదని, వేలంలో అన్ని కంపెనీలు పాల్గొనటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కె.ఉప్పలపాడు గ్రామానికి చెందిన రైతులు 707 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 530 కొనుగోలు చేశారు. 77 పొగాకు బేళ్లు తిరస్కరించారు. గరిష్ట ధర రూ.250 పలకగా, కనిష్ట ధర రూ.160, సరాసరి ధర రూ.188.13 పలికింది. ఈ వేలంలో మొత్తం 10 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి సత్య శ్రీనివాస్ తెలిపారు.
అద్దంకి రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం 3.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అద్దంకి రూరల్: అద్దంకి నుంచి శింగరకొండ వెళ్తున్న రహదారిలో ఉన్న 99 అడుగుల ఎతైన ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం, ఒంటె వాహనం, సరస్వతీదేవి విగ్రహాలకు నెల్లూరుకు చెందిన వ్యాపారి కామేని ప్రసాద్ సహకారంతో రూ.11 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఒంగోలుకు చెందిన శిద్దా వెంకటేశ్వర్లు సహకారంతో చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు, గదుల మరమ్మతులకు రూ.5 లక్షలతో నూతన రంగులు వేయనున్నట్లు తెలిపారు.


