చీమకుర్తి రూరల్:
పొగాకు రైతులు కష్టాలు పడుతుంటే కూటమి ప్రభుత్వం ఆదుకోకుండా చోద్యం చూస్తోందని వైఎస్సార్ సీపీ చీమకుర్తి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు ఆరోపించారు. చీమకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొగాకు పంటకు మద్దతు ధర లభించి ఆ రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడి పోరాడదామని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపు మేరకు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున సహాయ సహకారాలతో ఈ నెల 16, 17 తేదీల్లో నిరసన దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 16వ తేదీ కనిగిరిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద, 17వ తేదీ ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఒంగోలులో నిర్వహించనున్న నిరసన దీక్షకు చీమకుర్తి మండలం నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని పమిడి వెంకటేశ్వర్లు కోరారు.
రైతులను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం...
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందని, ముఖ్యంగా పొగాకు పంటకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు విమర్శించారు. రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన ఏ పంటకూ కూటమి ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధరల కోసం రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన రైతులు ఉన్నారన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దిగి వచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు పంట కొనుగోలు చేసేంత వరకు పొగాకు రైతులకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన పోరాడతామని, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తేగానీ ఽ
దరలు పెరగడం లేదు...
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాలు చేస్తేగానీ పంటల ధరలు పెరగడం లేదని పార్టీ చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి అన్నారు. గత సంవత్సరం కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు అండగా తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని, పొదిలి వేలం కేంద్రానికి వచ్చివెళ్లారని, ఫలితంగా పొగాకు కంపెనీలు పంట కొనుగోలు చేశాయని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ పోరాటాలు చేయకుంటే ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, రైతు విభాగం మండల అధ్యక్షుడు నల్లూరి చంద్ర, పార్టీ మండల ఉపాధ్యక్షులు యన్నం శేషురెడ్డి, శ్రీధర్ల శేషు, మాజీ కౌన్సిలర్ పాటిబండ్ల గంగయ్య, నాయకులు కూడలి మాలకొండయ్య, తెల్లమేకల గాంధీ, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, ఏలూరు సురేష్, ఉప్పలపాటి వెంకటరావు, గంగిరేకుల వెంకటరావు, పొన్నపల్లి నాగేశ్వరరావు, సుంకర శ్రీనివాసరావు, బాలాజీ, శివకృష్ణ, పాలడుగు సుబ్బారావు, కందిమల్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
పొగాకు పంటకు మద్దతు ధర లభించేంత వరకూ ఉద్యమిద్దాం
రేపు ఒంగోలులో నిరసన దీక్షను విజయవంతం చేద్దాం
వైఎస్సార్ సీపీ చీమకుర్తి మండల అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు పిలుపు


