మంగమూరు రోడ్డులో ప్రమాదాలు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

మంగమూరు రోడ్డులో ప్రమాదాలు నివారించాలి

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

మంగమూరు రోడ్డులో ప్రమాదాలు నివారించాలి కోడిపందేల శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి సీజ్‌ చేసిన వాహనాలకు 22న బహిరంగ వేలం క్యాన్సర్‌పై అవగాహన అవసరం

పోలీస్‌ అధికారులకు కలెక్టర్‌ రాజాబాబు సూచన

ఒంగోలు సబర్బన్‌: నగరంలో నిత్యం రద్దీగా ఉండే మంగమూరు రోడ్డు కూడలిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిలువరించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పి.రాజాబాబు పోలీస్‌ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం ఎస్పీ వి.హర్షవర్దన్‌రాజు, రోడ్డు ప్రమాదాల నివారణ జాయింట్‌ కమిటీ అధికారులతో కలిసి తరచూ ప్రమాదాలు జరుగుతున్న మంగమూరు రోడ్డు కూడలిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రమాదాలు జరగకుండా డైవర్షన్‌ రోడ్డు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జాయింట్‌ కమిటీ అధికారులకు సూచించారు. తరచూ ప్రమాదాల బారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, దానిని నివారించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అవసరమైతే ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీసీ సుశీల, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్‌ సీఐ చౌదరి, రోడ్లు, భవనాల శాఖ ఈఈ గోపీనాయక్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు టౌన్‌: నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామ పొలాల్లో బుధవారం మధ్యాహ్నం కోడిపందేల శిబిరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 కోళ్లు, 16 సెల్‌ఫోన్లు, 3 మోటారు సైకిళ్లు, 50,300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను ఒంగోలు తాలూకా పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి సీఐ కమలాకర్‌ తెలిపారు. ఈ దాడిలో ఎస్సై చెంచయ్య, ఏఎస్సై షేక్‌ మహబూబ్‌ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

చీమకుర్తి రూరల్‌: చీమకుర్తి ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీజ్‌ చేసిన వాహనాలకు ఈ నెల 22వ తేదీ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ సుకన్య ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో ఒక ఆటోతో పాటు హీరో హోండా స్ల్పెండర్‌ ప్లస్‌ మోటార్‌ సైకిల్‌ను విక్రయించనున్నట్లు వెల్లడించారు. ఆటో కనీస ధర రూ.18 వేలు (జీఎస్టీ అదనం), హీరో హోండా స్ల్పెండర్‌ ప్లస్‌ మోటార్‌ సైకిల్‌ కనీస ధర రూ.3,500 (జీఎస్టీ అదనం)గా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

ఒంగోలు సిటీ: స్థానిక క్విస్‌ ఫార్మసీ కళాశాల, కిమ్స్‌ హాస్పిటల్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్విస్‌ ఫార్మసీ కళాశాలలోని ధన్వంతరి సెమినార్‌ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరం ఏర్పాటు చేశారు. కిమ్స్‌ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ ఆంకాలజీ నిపుణులు నారు రమణారెడ్డి ముత్యాల హరి హేమంత్‌, ముత్యాల హరికిరణ్‌ పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్‌ నివారణ, ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించడం, హెచ్చరికలు, లక్షణాలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి వివరించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. క్యాన్సర్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ శిబిరంలో మామోగ్రఫీ, ఎక్స్‌–రే, పాప్‌ స్మియర్‌, డయాబెటిస్‌, రక్తపోటు పరీక్షలు చేశారు. క్విస్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ నిడమానూరి సూర్య కల్యాణ్‌ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నిడమానూరి గాయత్రి దేవి, ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కిశోర్‌బాబు, ఇంజిజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హనుమంతరావు, ఫార్మసీ సిబ్బంది, కిమ్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement