ఒంగోలు టౌన్: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా, ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహన తనిఖీలు చేస్తూ.. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. వాహనదారులు ప్రతిఒక్కరూ మోటారు వాహన చట్టం నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు.
కొత్తపట్నం: మండలంలోని అల్లూరు, కొత్తపట్నం ప్రాంతాల్లో ఆక్వా, ఉప్పు కొటారు రైతులకు గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్‌శాఖ ఏఈఈ (ఆపరేషన్) ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపట్నం సబ్‌స్టేషన్ వద్ద కొత్త లైన్ల పనుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
బేస్తవారిపేట: మండలంలోని పోగుళ్లలోని పొలాల్లో కొత్తగా ఏర్పాటు చేసుకున్న బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కోనపల్లెకు చెందిన తిరుఓయపాటి రవితేజ (28) కోనపల్లె, గలిజరుగుళ్ల పరిసర ప్రాంతాల్లో జేఎల్‌ఎం రమణ వద్ద ప్రైవేట్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఈ పంచాయతీల్లో విద్యుత్ పనులు జేఎల్‌ఎంతో కలిసి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోగుళ్లలో దొర వెంకటయ్య వ్యవసాయ పొలంలో నూతనంగా బోరు ఏర్పాటు చేసుకున్నాడు. బోరుకు విద్యుత్ లైన్ ఇచ్చేందుకు జేఎల్‌ఎంను రైతు కోరాడు. జేఎల్‌ఎం ఎల్‌సీ తీసుకున్నానని చెప్పడంతో రవితేజ లింగయ్య పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నుంచి వెంకటయ్య పొలంలోకి విద్యుత్‌లైన్ ఇచ్చేందుకు కరెంట్ స్తంభం ఎక్కాడు. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. టి.లక్ష్మీదేవి, సూరిబాబు దంపతులకు రవితేజ ఒక్కడే కుమారుడు. కుటుంబానికి జీవనాధారమైన కుమారుడి మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని విద్యుత్‌శాఖ ఏఈ సన్యాసిరావు, ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి పరిశీలించారు. సంఘటనకు కారణాలు అడిగితెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


