ఒంగోలు సిటీ: స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాల – యూనివర్సిటీ ఆఫ్ పర్పిచ్యువల్ హెల్త్ సిస్టమ్ డల్టా మెలీనో ఫిలిప్పీన్స్ మధ్య వివిధ అంశాల్లో అవగాహన ఒప్పందం జరిగినట్లు విద్యాసంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఐదేళ్ల కిందట జరిగిన ఒప్పందాన్ని ఆన్‌లైన్ ద్వారా సమావేశమై కొనసాగిస్తున్నట్లు అంగీకారం తెలియజేసుకున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ పర్పిచ్యువల్ హెల్త్ సిస్టమ్ డల్టా మెలీనో – క్విస్ ఇంజినీరింగ్ కళాశాల సంయుక్తంగా అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, స్టూడెంట్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రాంలకు సంబంధించి ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఈ మేరకు ఈ ఐదేళ్లలో యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ – క్విస్ కళాశాల సంయుక్తంగా అంతర్జాతీయ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఫిలిప్పీన్స్ విద్యార్థులు సైతం క్విస్ కళాశాలలో ప్రత్యేక శిక్షణ పొందారన్నారు. ముందుముందు మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అవగాహన ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ పర్పిచ్యువల్ హెల్త్ సిస్టమ్ డల్టా మెలీనో యూనివర్సిటీకి చెందిన సాల్వె క్రిస్టీని, పాస్టర్ ఆర్.అరిగులేస్, ప్రొఫెసర్ రెనో ఆర్ రాయల్ పాల్గొన్నారు. క్విస్ విద్యాసంస్థలతో పనిచేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని, తమ విద్యార్థులు క్విస్‌లో చాలా కొత్త టెక్నాలజీలు నేర్చుకున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో క్విస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.హనుమంతరావు, డీన్ అకడమిక్స్ డాక్టర్ సత్యమెహర్, డీన్ ప్లానింగ్ డాక్టర్ చల్లారామ్‌స్వామి పాల్గొనగా, కార్యక్రమాన్ని సీఎస్‌ఈ హెచ్‌వోడీ డాక్టర్ బుజ్జిబాబు పర్యవేక్షించారు. వివిధ విభాగాల హెచ్‌వోడీలు, డీన్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
అద్దంకి: బస్సు–కారు ఢీకొట్టుకున్న ఘటన మండలంలోని గోవాడ జంక్షన్ వద్ద బుధవారం జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. అద్దంకి నుంచి గోవాడీ మీదుగా చిలకలూరిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు గోవాడ జంక్షన్ వద్ద ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు, కారులోని వారికి ఏమీ కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


