వెనుకబాటే.. | - | Sakshi
Sakshi News home page

వెనుకబాటే..

Jul 11 2026 3:40 AM | Updated on Jul 11 2026 3:40 AM

పీజీడీఐ సర్వేలో జిల్లా పరిస్థితి దారుణం

దేశవ్యాప్తంగా 550వ ర్యాంక్‌..

రాష్ట్రస్థాయిలో 33వ స్థానం

600 మార్కులకు గాను జిల్లాకు 284

ప్రశ్చస్తా–2లో దక్కిన చోటు

ఆదిలాబాద్‌టౌన్‌: అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్‌ జిల్లా అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడింది. దేశంలోని పాఠశాలల విద్యా నాణ్యత మరింత మెరుగుపర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏటా పాఠశాల ర్యాంకులను విడుదల చేస్తోంది. రెండు రోజుల క్రితం విడుదలైన గ్రేడింగ్‌లో జిల్లా పరిస్థితి దారుణంగా ఉంది. కేంద్ర విద్యాశాఖ పర్ఫామెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ డిస్ట్రిక్ట్‌ (పీజీఐ–డీ) 2025–26 ఫలితాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 794 జిల్లాల్లో 550 ర్యాంక్‌తో వెనుకబడింది. రాష్ట్రంలోని జిల్లాల్లో ఆదిలాబాద్‌కు 33వ స్థానం దక్కడం జిల్లా విద్యాశాఖ పనితీరుకు అద్దం పడుతుంది. మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, డిజిటల్‌ లర్నింగ్‌, నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత, పరిపాలన తదితర అంశాలకు సంబంధించి కేంద్రం ర్యాంకులను రూపొందించింది. 600 మార్కులకు గాను 284 మార్కులు సాధించింది. పశ్చస్తా–2లో చోటు దక్కింది. సగటు కంటే కొంత మెరుగ్గా విద్యార్థుల ప్రమాణాలు ఉన్నట్లు వెల్లడించింది. ఏటా జిల్లా పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడటం లేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు చదవడం, రాయడం రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

మెరుగుపడని విద్యాబోధన..

కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పీజీఐడీ పనితీరులో రాష్ట్రస్థాయిలో జిల్లాకు చివరి స్థానం దక్కింది. ఉపాధ్యాయుల పనితీరు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, మౌలిక వసతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పరంగా ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నా యి. గత కొన్నేళ్లుగా జిల్లాకు రెగ్యులర్‌ విద్యాశాఖ అధికారి లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం, కొంత మంది ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, రెగ్యులర్‌ ఎంఈవోలు లేకపోవడం వెరసి విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం నిధులు కేటాయించడం, మౌలిక వసతులు కల్పించినప్పటికీ ఫలితాలు కానరాకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కేటగిరీలు ఇలా..

ఆరు విభాగాలకు సంబంధించి మొత్తం 600 మార్కులకు గాను జిల్లాకు 284 మార్కులు వచ్చాయి. ఇందులో ఔట్‌ కమ్‌, లర్నింగ్‌ ఔట్‌కమ్‌, యాక్సెస్‌, టీచర్‌, అవెలబిలిటి విభాగంలో 290 మార్కులకు గాను 134 మార్కులు వచ్చాయి. ఎఫెక్టీవ్‌ క్లాస్‌రూమ్‌ ట్రాన్సక్షన్‌, లర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్‌రీచ్మెంట్‌ కార్యకలాపాల్లో 90కు గాను 52 మార్కులు వచ్చాయి. ఇన్ఫాస్ట్రక్చర్‌, ఫెసిలిటీస్‌, స్టూడెంట్‌ ఎన్‌టైటిల్మెంట్‌, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో 51కి గాను 36 మార్కులు వచ్చాయి. స్కూల్‌ సేఫ్టీ అండ్‌ చైల్డ్‌ ప్రొటక్షన్‌న్‌, బాలల రక్షణ చర్యల్లో 35కు గాను 15 మార్కులు వచ్చాయి. డిజిటల్‌ విద్య అమలులో 50కి గాను 12, గవర్నెన్స్‌ ప్రాసెస్‌, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, స్కూల్‌ లీడర్‌షిప్‌ విభాగంలో 84కు గాను 35 మార్కులు లభించాయి. ఇందులో ఏ విభాగంలోనూ జిల్లా ప్రతిభ కనబర్చినట్లు లేకపోవడం గమనార్హం.

విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు

పీజీఐడీ గ్రేడింగ్‌లో జిల్లా వెనుకబడిన విషయం వాస్తవమే. రాష్ట్ర స్థాయిలో 33వ స్థానంలో నిలిచింది. వచ్చే ఫలితాల్లో టాప్‌–10లో ఉంటాం. విద్యాప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాం. యూడైస్‌ను పకడ్బందీగా అమలు చేస్తాం. బడిబయట పిల్లల్ని గుర్తించి పాఠశాలల్లో చేర్పిస్తాం. ఖాన్‌ అకాడమీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తాం.

– లక్ష్మణ్‌, సెక్టోరియల్‌ అధికారి

జిల్లాలోని పలు సర్కారు బడుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని తెలుస్తోంది. విద్యార్థుల హాజరు సక్రమంగా ఉండటం లేదు. చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. భాషా, గణితం, సైన్స్‌లో వెనుకబడిపోతున్నారు. పదో తరగతి చదువుతున్నప్పటికీ కనీసం చతుర్విద ప్రక్రియలు చేయలేకపోతున్నారని సర్వేలో వెల్లడి అవుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్‌, డిగ్రీకి వచ్చేసరికి వెనుకబడిపోతున్నారు. ఏడాది పాటు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులే పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతోనే ఉన్నత చదువుల్లో విద్యార్థులు రాణించలేకపోతున్నారనే ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement