పరీక్ష ఫలితాల్లో ఫెయిలైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చదువు కొనసాగించడం.. మార్కులు పెంచుకునేందుకు బోర్డు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఫెయిలైన సబ్జెక్టులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే సంవత్సరం ఉన్నత చదువులకు వెళ్లేందుకు వీలుంటుంది. తమకు వచ్చిన మార్కుల(మార్కులు తక్కువొచ్చినా, ఫెయిలైనా)పై నమ్మకం లేని విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాసైనా మార్కులు తక్కువొచ్చాయని భావిస్తే విద్యార్థులు బెటర్మెంట్ పరీక్షలు రాసి మెరుగుపర్చుకోవచ్చు. ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చి పలుచన చేయకుండా తల్లిదండ్రులు సన్నిహితంగా ఉంటూ ధైర్యం కల్పించాలి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వరకు పరీక్షలు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 53,307 మంది పరీక్షలు రాశారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానుండడంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
నిరుత్సాహం దరిచేరనీయొద్దు
పరీక్ష ఫలితాల్లో తగిన మార్కులు రాలేదని ఫెయిల్ అయ్యామని చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. భావోద్వేగాలను సమన్వయపర్చుకుంటూ ఒత్తిడికి గురి కాకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలి. ఆత్మవిశ్వాసం పెంపొందించే గాథలు, అనుభవాలను వారితో పంచుకోవాలి. పరీక్షలే జీవితానికి పరమావధి కాదని వారికి తెలియజెప్పాలి. జీవితంలో ఎదిగేందుకు అనేక మార్గాలు ఉంటాయని అవగాహన కల్పించాలి. – మోత్కూరి రామచందర్,
రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్
ఈ చిత్రంలో మధ్యలో కనిపిస్తున్న యువకుడు నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామానికి చెందిన పంతిక ప్రవీణ్. ఎంసీఏ పూర్తి చేశాడు. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. నచ్చిన ఉద్యోగం రాకపోవడంతో స్వయంశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. పౌల్ట్రీ రంగంలో మెలకువలు నేర్చుకుని ప్రభుత్వ రుణ సదుపాయంతో పౌల్ట్రీఫామ్ నెలకొల్పాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. శిక్షణ ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులు వ్యవసాయం, పౌల్ట్రీఫాంను సందర్శించి అతడిని అభినందించారు. ఉద్యోగంలో ప్రవేశిస్తే ఎక్కడో ఒకచోట మాత్రమే పరిమితమైన సేవలందించే వాడినని, ప్రస్తుతం మరో పదిమందికి ఉపాధి కల్పించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని ప్రవీణ్ చెబుతున్నాడు.
‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’.. అంటే నీ కర్తవ్యాన్ని నిష్కామంగా చేయడం మాత్రమే నీ చేతుల్లో ఉంది. ఫలితంపై నీకు హక్కు లేదు. ఏది జరిగినా అది భగవంతుని సంకల్పంగా భావించి సమత్వంతో స్వీకరించడమే నిజమైన జ్ఞానం. – భగవద్గీత
మంచిర్యాలఅర్బన్/నిర్మల్‌ఖిల్లా: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. పదో తరగతి రిజల్ట్స్ త్వరలో వెలువడుతాయి. ఏడాదంతా కష్టపడ్డాం.. ఫలితం ఎలా ఉంటుందోననే ఒత్తిడి.. ఆశలు ఉండడం విద్యార్థులకు సహజమే. కానీ.. ఫలితాలు ఒక్కటే జీవితాన్ని పూర్తిగా నిర్ణయించలేవు. పరీక్ష తప్పితే మరోసారి రాసుకోవచ్చు. ఆశించిన ర్యాంకు.. మార్కులు రాలేదని తట్టుకోలేకపోతుంటారు. తల్లిదండ్రులు కాస్త భరోసా కల్పించాలి. క్షణికావేశంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకం మిగుల్చుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చదువు జీవితంలో భాగమే కానీ అదే జీవితం కాదని ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆత్మస్థైర్యాన్ని నింపాలని విద్యావేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు.
నిరాశ వద్దు..
పౌల్ట్రీరంగంలో ఎదిగి..
53వేల మంది..
ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు
మంచిర్యాల 12,317
ఆదిలాబాద్ 17,564
నిర్మల్ 13,125
ఆసిఫాబాద్ 10,301


