కై లాస్‌నగర్: జిల్లాలోని తలమడుగు మండలం పల్సి–బి తండాకు చెందిన గిరిజన రైతులకు సంబంధించి గత 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం, సర్వే నంబర్లలోని సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది మంది గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములను సాగు చేస్తున్నప్పటికీ వాటిపై హక్కులేకపోవడంతో దశాబ్దకాలానికి పైగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోయారు. ఈమేరకు ప్రజావాణిలో వారి సమస్యలను ఆలకించిన కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. సీసీఎల్‌ఏతో సమన్వయం చేసి పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించారు. మొత్తం 30 ఎకరాల భూమిని అర్హులైన రైతులకు కేటాయించారు. తొమ్మిది మందికి సాగు విస్తీర్ణం ఆధారంగా 2 నుంచి 3 ఎకరాల వరకు పట్టాలను సిద్ధం చేశారు. కలెక్టర్ శనివారం స్వయంగా లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఏళ్ల నాటి సమస్య పరిష్కారం కావడంతో హర్షం వ్యక్తం చేసిన ఆదివాసీ రైతులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులున్నారు.


