ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర మంత్రి వివేక్ ప్రజాతీర్పును గౌరవించకుండా దౌర్జన్యం, దాడులు చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో అరెస్టయి జిల్లా జైలులో రిమాండ్‌పై ఉన్న ఆయన బుధవారం బెయిలుపై విడుదలయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయమే జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. భుజాలపైన ఎత్తుకుని గజామాలతో సత్కరించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి ము న్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఐ కలిసి పోటీ చేసిందన్నారు. మొత్తం 22 వార్డులకు గాను 14 వా ర్డులను బీఆర్‌ఎస్, సీపీఐ కూటమి గెలిచిందన్నారు. ఏడు సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవీ కోసం మంత్రి వివేక్ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ 14 మంది కౌన్సిలర్లు భద్రాచలంలో ఉంటే పోలీసులతో కిడ్నాప్ చేసే యత్నం చేయగా తాను వెళ్లి వారిని అక్కడి నుంచి చెన్నూర్‌లోని తన నివాసానికి తీసుకు వచ్చానన్నారు. 16న చైర్మన్ ఎన్నికకు హాజరయ్యే క్రమంలో పోలీసులు అడ్డుకుని అలస్యం చేసి ఎన్నిక ప్రకయ వాయిదా వేశారన్నారు. 17న కూడా పోలీసులతో తమను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. మున్సిపాలిటీకి రెండు కిలోమీటర్ల దూరంలో తనతో పాటు పార్టీ ఎన్నికల పరిశీలకురాలిగా నియమించిన కోవ లక్ష్మిని పోలీసులు నిలవరించారన్నారు. కానీ మంత్రి కాన్వాయ్‌తో వందల మందిని పంపిస్తే తాము ప్రశ్నించినందుకు తమపై లాఠీచార్జితో పాటు కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడి చేశారన్నారు. అంతేకాకుండా మాపైనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఇదే కాకుండా 16 రోజులుగా తనకు బెయిల్ రాకుండా అనేక కుట్రలు పన్నారన్నారు. మంచిర్యాల, హైదరాబాద్ కోర్టులో బెయిల్ వచ్చిన కూడా చెన్నూర్‌కు రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. చిన్న కొడుకు జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో ఉండనివ్వకుండా, అలాగే హోలి పండగ సంబరాలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుల సహకారంతో పాటు లాయర్ల కృషి ఫలితంగా తాను బయటకు వచ్చినట్లుగా తెలిపా రు. ఆయన వెంట మాజీ మంత్రి జోగు రామన్న, నాయకులు యూనీస్ అక్బానీ తదితరులున్నారు.


