● కేంద్ర ప్రభుత్వం ఆదేశం
కై లాస్‌నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించే బియ్యం మూడు నెలల కోటా ఒకేసారి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎండల తీవ్రత నేపథ్యంలో కార్డుదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన కోటాను ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 2లక్షల 26వేల 248 మందికి లబ్ధి చేకూరనుంది. మూడు నెలలకు గాను 14,073 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా పౌరసరఫరా శాఖ చర్యలు చేపడుతోంది. ఇదివరకు గతేడాది జూన్‌లో వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల కోటాను లబ్ధిదారులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తూ అధికారులు తాజాగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.


