కాంగ్రెస్‌లో పదవుల పందేరం బూత్ నుంచి జిల్లాస్థాయి కమిటీల నియామకం పక్షం రోజుల్లో పూర్తి చేసేలా పార్టీ ఫోకస్
సాక్షి,ఆదిలాబాద్: అధికార కాంగ్రెస్‌లో ఇక పదవుల పందేరం షురూ కానుంది. పక్షం రోజుల్లో బూత్‌స్థాయి నుంచి మొదలుకుని గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో అన్నిరకాల పదవులను భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించింది. గ్రూపు తగాదాల నేపథ్యంలో ఆయా కమిటీల్లో ఎంపికలో ఏకాభిప్రాయం కుదురుతుందా.. లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వికారాబాద్‌లో డీసీసీ అధ్యక్షులకు ఇటీవల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ నేపథ్యంలో స్థానిక కమిటీల నియమాకంపై దృష్టి సారించాలని, డీసీసీ అధ్యక్షున్ని సమన్వయం చేసుకొని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఈ ప్రక్రియ కొలిక్కి తేవాలని పార్టీ పరంగా ఆదేశాలు వెలువడ్డాయి.
ఈ నెల 15లోగా ప్రక్రియ పూర్తి..
మూడు నెలల కిందట డీసీసీ అధ్యక్షుడిగా నరేశ్‌జాదవ్ నియామకం కాగా జిల్లా కమిటీలోని ఇతర పదవులు భర్తీ చేయలేదు. తాజాగా ఈ పదవులన్నింటిని తక్షణం భర్తీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఈనెల 15లోగా ప్రక్రియ ముగించాలని పేర్కొంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీలోని ముఖ్య నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం వారి మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా కమిటీలో వారి అనుచరులకు ప్రాధాన్యత కల్పించే విషయంలో ముఖ్య నేతల మధ్య విభేదాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోపక్క ఆశావహులు ఆయా నేతల ద్వారా జిల్లా కమిటీలో పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. బూత్, గ్రామ, మండల కమిటీలను కూడా నియమించాలని, పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఆ ప్రక్రియలన్నింటిని పూర్తి చేసేందుకు జిల్లా కాంగ్రెస్ దృష్టి సారించింది.
డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్ ఎంపికై న తర్వాత పార్టీలో గ్రూపు తగాదాలను నివారించేందుకు విస్తత ప్రయత్నాలు చేస్తున్నరు. ముందు నుంచి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డిని విభేదిస్తూ టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలు ఓ వర్గంగా కొనసాగుతున్నారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఓ గ్రూప్‌గా, మాజీ జెడ్పీటీసీ గణేశ్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మరో గ్రూప్‌గా.. ఇలా కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతుంది. పార్టీ పదవుల్లో తమ అనుచరులకు చోటు దక్కేందుకు ఎవరికి వారు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో అందరూ సమన్వయంగా ఉన్నట్టు పైకి కనిపించినప్పటికీ అంతర్గతంగా మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా కొనసాగారు. ఈ ప్రభావం కారణంగానే మున్సిపల్‌లో అత్యధిక వార్డుల్లో కాంగ్రెస్ గెలుస్తుందని భావించినప్పటికీ రెండో స్థానానికి పరిమితమైందనే విమర్శలున్నాయి.
సమన్వయం కుదిరేనా..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హస్తం పార్టీలో ఇలాంటి పరిస్థితే ఉండడంతో ఇటీవల డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాల అనంతరం పార్టీ అధిష్టానం కమిటీల ఎంపిక విషయంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులను సమన్వయం చేసుకొని ప్రక్రియను ఏకాభిప్రాయంగా ముగించాలని చెప్పారు. జిల్లాలో మాత్రం పరిస్థితు భిన్నంగా ఉన్నాయి. జిల్లా పరిధికి వచ్చే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ హస్తం పార్టీకి చెందిన నేతే అయినప్పటికీ ఆయన నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఉండడంతో ఆదిలాబాద్ విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఇక జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు పార్టీ పరిస్థితులపై దృష్టి సారించే పరిస్థితి ఉంది. ఇటు డీసీసీ అధ్యక్షుడు, అటు ముఖ్య నాయకులను ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి పదవుల పందెరాన్ని పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది.


