ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

ఇంటర్

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఈనెల 25నుంచి మార్చి 18 వరకు

జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలు

హాజరుకానున్న 17,564 మంది విద్యార్థులు

ఆన్‌లైన్‌ నుంచి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఐఈవో జాదవ్‌ గణేశ్‌కుమార్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్నాయి.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది.. విద్యార్థులు కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి.. మాస్‌కాపీయింగ్‌పై ఆధారపడవద్దు.. ఏవైనా ఇబ్బందులు ఉంటే డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలి.. హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా కూడా డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చని డీఐఈవో జాదవ్‌ గణేష్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.

సాక్షి: జిల్లాలో ఎన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు?

డీఐఈవో: జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలను ఏర్పాటు చేశాం. వీటిలో 13 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, రెండు సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఐదు ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు, అలాగే మహాత్మాజ్యోతి బాపూలే గురుకులం, మోడల్‌ స్కూల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశాం. తొమ్మిది ప్రైవేట్‌ కళాశాలల్లో పరీక్షలు జరగనున్నాయి.

సాక్షి: ఎంత మంది విద్యార్థులు హాజరు కానున్నారు?

డీఐఈవో: ప్రథమ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 7,700 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 935 మంది పరీక్షలు రాయనున్నారు. ద్వితీ య సంవత్సరంలో జనరల్‌ విద్యార్థులు 7,971 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 958, మొత్తం 8,929 మంది హాజరుకానున్నారు.

సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టారు..?

డీఐఈవో: పరీక్షల నిర్వహణ కోసం 31 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 31 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 9 మంది అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లతో పాటు అవసరమైన ఇన్విజిలెటర్లను నియమించాం. ప్రశ్నపత్రాల స్టోరేజ్‌కు సంబంధించి 13 కేంద్రాలను ఏర్పాటు చేశాం. గుడిహత్నూర్‌, నేరడిగొండ, బోథ్‌, బజార్‌హత్నూర్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, తలమడుగు, తాంసి, బేల, జైనథ్‌ పోలీసుస్టేషన్లలో ఉంచడం జరుగుతుంది.

సాక్షి: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు..?

డీఐఈవో: విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గదుల్లో చీకటి లేకుండా లైట్ల ఏర్పాటుతో పాటు ఫ్యాన్లు, తాగునీరు, వైద్యారోగ్య శాఖ ద్వారా ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచుతున్నాం.

సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏమిటి?

డీఐఈవో: విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఒత్తిడికి లోను కావొద్దు. మాస్‌కాపీయింగ్‌పై ఆధార పడకూడదు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం. ఏవైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌ డెస్క్‌ 08732– 297115కు సమాచారం అందించాలి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షలు పూర్తయ్యేంత వరకు టీవీ, సోషల్‌ మీడియా, పెళ్లిలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను పరీక్షల కోసం సంసిద్ధులను చేయాలి.

సాక్షి: మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

డీఐఈవో: పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే జిల్లా పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డీఐఈవో కన్వీనర్‌గా, లెక్చరర్లు సభ్యులుగా ఉన్నారు. అలాగే రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశాం. ఈ బృందంలో జూనియర్‌ లెక్చరర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఏఎస్సై ఉంటారు. రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయగా, ఇందులో ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లు ఉంటారు. ఐ పవర్‌ కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరా లు ఇదివరకే ఏర్పాటు చేయడం జరిగింది. నిఘా నీడలో పరీక్షలు జరుగుతాయి.

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు1
1/1

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement