భక్తుల కొంగుబంగారం..బాలేశ్వరుడు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాకేంద్రంలోని సమీప పవిత్ర పెద్దవాగు నది తీరాన గల భక్తుల కొంగు బంగారం బాలేశ్వరస్వామి విరాజిల్లుతోంది. రథోత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుంచి ఆలయంలో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25న రథోత్సవం నిర్వహించనున్నారు. సుమారు 50వేల మంది హాజరుకానున్నారు. మున్సిపాలిటీ, ఆలయ కమిటీ, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణానికి చెందిన రావుల ఫ్యామిలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 12 అడుగుల శివలింగం పనులు చకచకా సాగుతున్నాయి. పోలీసు ఆధ్వర్యంలో బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఆలయ చరిత్ర..
నాలుగు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పాలిస్తున్న కాలంలో పెద్దవాగు ఒడ్డున ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ రైతు చేనులో నాగలి పట్టి దున్నతుండగా ఏదో తగిలింది. తవ్వి చూడగా శివలింగం బయటపడినట్లు తెలుస్తోంది. దాన్ని అక్కడే ప్రతిష్ఠించారు. గోండురాజులు రాతితో ఆలయాన్ని నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. నేటికి శివలింగంపై నాగలి తగలడం వల్ల ఏర్పడిన గాటు గమనించవచ్చు. అప్పటి నుంచి పూజలు చేస్తుంటారు. రాంచందర్‌రావ్(పైకాజీ) ఆలయ ప్రహరీ నిర్మించి శ్రీకారం చుట్టగా, నది ప్రవాహానికి కోతకు గురైంది. పిల్లర్లు వేసి కప్పు భాగాన్ని మరింత పెంచి, చుట్టూ ప్రహరీ నిర్మించారు. తర్వాత దండనాయకుడు నారాయణరావ్ (రమేశ్‌బాబు) కొన్నేళ్లుగా నిర్వహణలో ఉంది. పట్టణ ప్రముఖుడు టీఆర్ బాబురావ్ ఆలయ ఈ శాన్యంలో హనుమంతుడి విగ్రహానికి మందిరం నిర్మించి భక్తుల సౌకర్యార్థం మెట్టు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మించారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచేకాక మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ నుంచి భక్తులు తరలివస్తారు.
ప్రతీరోజు పూజా కార్యక్రమాలు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీగణపతి హోమం, శ్రీ చండీ సప్తశతి హవనం, నవగ్రహ, అరుణ హోమాలు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, కుంకుమార్చనలు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, ఉత్సవమూర్తుల రథోత్సవ (రథసప్తమి) జాతర కొనసాగనుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయి.
భక్తుల కొంగుబంగారం..బాలేశ్వరుడు


