ఎక్కడి పనులు అక్కడే!
బాసర: శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి జన్మదినం అయిన వసంత పంచమి వేడుకలు బాసరలో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21 నుంచి 23 వరకు వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో అంజనాదేవి ప్రకటించారు. వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతోపాట పలువురు అతిథులను ఆహ్వానించారు. ఇక వేడుకల సందర్భంగా అమ్మవారి దర్శనానికి తెలురు రాష్ట్రాలతోపాటు ఉత్తర భారత దేశం నుంచి కూడా వేల మంది భక్తులు తరలివస్తారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు జరగడంలేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పవని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అధికారులతో ఈవో సమీక్ష
దేవస్థాన అధికారులు భక్తులకు అన్నివిధాలా సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ఈవో అంజనాదేవి తెలిపారు. అధికారులతో సమీక్ష చేసి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆమేరకు పనులు జరగడం లేదు. క్యూలైన్ల ఏర్పాట్ల పనులు మాత్రం ఆదివారం మొదలయ్యాయి.
గోదావరి తీరంలో వ్యర్థాలు..
అమ్మవారి పుట్టిన రోజు అయిన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేల మంది తరలివస్తారు. అమ్మవారి దర్శనానికి ముందు సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తారు. అక్షరాభ్యాసం కోసం మూడు మండపాలు ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. ఇక గోదావరి తీరంలో ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. పుష్కర ఘాట్ల వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. నదిలో నీరు కూడా దుర్వాసన వస్తోంది. స్నానం చేసే భక్తులు లోపలికి వెళ్లకుండా ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నదిలో మురికి నీటినీ తొలగింపజేయాలని, ఘాట్లపై వ్యర్థాలు తొలగించాలని భక్తులు కోరుతున్నారు.
గోదావరి రెండోఘాట్ వద్ద చెత్తాచెదారం వ్యర్థాలు
ఎక్కడి పనులు అక్కడే!


