ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని కొత్త కుమ్మర్‌వాడకు చెందిన ఇందారపు ప్రభాకర్(38) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
నవాబ్‌పేటలో ఒకరు
కడెం: మండలంలోని నవబ్‌పేట్ గ్రామానికి చెందిన చింతకుంట మహేశ్(28) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై పి.సాయికిరణ్, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహేశ్‌కు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెందిన సాదరికతో 2024 డిసెంబర్‌లో వివాహమైంది. సంక్రాంతి రోజున భర్తతో గొడవపడి సాదరిక పుట్టింటికి వెళ్లింది. ఇటీవల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో బావమరుదులు కొట్టడం, అత్తమామలు, భార్య తిట్టడంతో మనస్తాపం చెందాడు. ఈ నెల 17న రాత్రి ఇంట్లో సూసైడ్ నోటు రాసిపెట్టి ఉ రేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఆటోలు సీజ్
ఆదిలాబాద్‌టౌన్: పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తరలిస్తూ నిబంధనలు పాటించని 12 ఆటోలను సీజ్ చేసి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మివాడ, ఇందిరానగర్, ఖుర్షీద్‌నగర్, నెహ్రూచౌక్‌లలో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహన యజమానులపై చర్యలు చేపట్టారు.
సాత్నాల: భోరజ్ మండలం తర్నం గ్రామంలో దీప క్ అగర్వాల్‌కు చెందిన పంట పొలంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. రైతు పంట పొలంలో ఉంచిన 100 పైపులకు నిప్పుంటుకొని కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రూ.75 వేలు విలువ చేసే పైపులు దగ్ధమయ్యాయి. స్తంభం కింద పైపులు ఉండటంతో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య


