ఆనందగిరి
● మన్యంలో పర్యాటకుల సందడి
● మారేడుమిల్లి, సీతపల్లికి తాకిడి
రంపచోడవరం: పచ్చని చెట్లు.. చల్లని గాలులు.. వాగులు.. జలపాతాలు.. ఘాట్ రోడ్లు.. ఇలా ఆహ్లాదానికి, ఆనందానికి మన్యం పెట్టింది పేరు. అందుకే జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందడి వచ్చింది. సంక్రాంతి సెలవు రోజుల్లో పర్యాటకులు ఆహ్లాదంగా గడిపారు. సెలవులు ముగియడంతో చివరి రోజైన ఆదివారం తాకిడి మరింత పెరిగింది. మారేడుమిల్లితో పాటు అక్కడి పర్యాటక ప్రాంతాలకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. మారేడుమిల్లికి ఏడు కిలోమీటర్ల దూరంలోని జలతరంగణి వద్ద సందడి చేశారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో సరదాగా గడిపారు. జలపాతం వద్ద స్నానాలు చేశారు. అలాగే అమృతధార, పాములేరును సందర్శించారు. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలోని గుడిసె గ్రాస్ ల్యాండ్ పర్యాటకులతో కిక్కిరిసింది. అక్కడ సూర్యోదయం, పొగమంచును చూసేందుకు తెల్లవారుజాముకే అక్కడ ఉంటున్నారు. అలాగే లస, దుంపవలస జలపాతాలకు వద్ద ఆహ్లాదంగా గడిపారు. మారేడుమిల్లికి పర్యాటకుల రాకతో రోడ్డు అంతా వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి ఇబ్బందులు ఏర్పడ్డాయి. బొంగు చికెన్ కొనుగోలు చేసుకొనేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. హోటళ్లు ఎక్కడా ఖాళీ లేకుండా ఉన్నాయి. రంపచోడవరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఐ.పోలవరంలో సీతపల్లి వాగు వద్ద పార్కుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. సీతపల్లి వాగులో స్నానాలు చేశారు. అక్కడ బ్రిడ్జి వద్ద వాహనాలు బారులు తీరాయి. రంప జలపాతం వద్దకు పర్యాటకులు తరలివెళ్లారు. అక్కడ పురాతన శివాలయాన్ని దర్శించుకున్నారు.
ఆనందగిరి
ఆనందగిరి
ఆనందగిరి


