వస్తాం.. మళ్లొస్తాం! | - | Sakshi
Sakshi News home page

వస్తాం.. మళ్లొస్తాం!

Jan 19 2026 4:45 AM | Updated on Jan 19 2026 4:45 AM

వస్తా

వస్తాం.. మళ్లొస్తాం!

జ్ఞాపకాల దొంతరతో వెళ్తున్నా

గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి వేడుకల్లో ఈ ఏడాది నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మురమళ్లకు పిలిచి పండగ వేడుకల్లో భాగం చేసుకున్నారు. ఇందంతా నా అదృష్టం. నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది. ఈసారి నా వెంట అమెరికాకు చాలా అందమైన జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నాను. మళ్లీ సంక్రాంతి పండగకు వచ్చే వరకు వీటన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాను.

– మోర్తా శిరోమణి, అమెరికా

అనుభూతులు మూటగట్టుకుని..

మాది హైదరాబాద్‌. సంక్రాంతి పండగకు కోనసీమ జిల్లా అమలాపురంలో బంధువుల ఇంటికి వచ్చాం. ఇక్కడి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాను. ఆత్రేయపురంలో జరిగిన పడవల పోటీలు చూశాం. జగ్గన్న తోట ప్రభల తీర్థం చూసి ఆనందపడ్డాను. కోనసీమ సంప్రదాయమైన కోడి పందేలు చూశాం. పది రోజుల పాటు కోనసీమ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మధురమైన జ్ఞాపకాలతో ఇంటికి వెళ్తున్నాను.

– మెల్లం రమేష్‌ బాబు,

అధ్యాపకుడు, హైదరాబాద్‌

సాక్షి, అమలాపురం: తెలుగింటి పెద్ద పండగ సంక్రాంతి ముగిసింది. మూడు రోజుల పండగకు రెక్కలు కట్టుకుని వాలిపోయిన స్థానికులు, బంధువులు, మిత్రులు తిరుగు పయనమయ్యారు. ముక్కనుమ నాడు వేసిన రథం ముగ్గుతో వీధుల్లో రంగవల్లులు వేయడం నిలిపివేశారు. నాలుగు రోడ్ల కూడళ్లలో భగభగ వెలిగిన భోగి మంటల బూడిద మిగిలింది. జనంతో కళకళలాడిన అమ్మవారి జాతరలు, ప్రభల తీర్థాలు జరిగిన ప్రాంతాలు ఖాళీగా మారాయి. కోడి పందేలు, గుండాటల బరులు దీనంగా చూస్తున్నాయి. మొత్తం మీద పండగ అయిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు శనివారం నుంచి తిరిగి వెళ్లిపోతున్నారు. వీరి వెళ్లిపోవడంతో పల్లెలు బోసిపోయాయి.

పండగ కోసం వచ్చినవారు ‘వెళ్లలేమంటూ.. వీడలేమంటూ.. వీడుకోలు’ పలుకుతున్నారు. సంక్రాంతి పండగ కోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు స్థానికులు, వారి బంధువులు, ఇతర ప్రాంతాలకు చెందిన మిత్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మూడు రోజుల పండగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సందడిగా గడిపారు. పట్టణాల్లో మరిచిపోయిన గోదావరి సంస్కృతి, సంప్రదాయాలు గుర్తు చేసుకున్నారు. పట్టు పరికిణీలు, పట్టు పంచెలు ధరించారు. భోగి మంటలు చుట్టూ చేరి ఆడిపాడారు. పొంగిన పాల కుండలను చూసి మురిసిపోయారు. గంగిరెద్దు వాళ్ల పొగడ్తలతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆరిసెలు, పాకుండలు రుచి చూశారు. వీటితో పాటు గోదావరి అల్పాహారం, ఈ ప్రాంత రుచులను ఆస్వాదించారు. కోడి పందేలు, ప్రభల తీర్థాలను చూసి ముచ్చటపడిపోయారు. పండగ మూడు రోజులూ తమను తాము మరిచిపోయారు. పాఠశాలల్లో చదువుకున్న పాత స్నేహితులు కలుసుకున్నారు. గత జ్ఞాపకాలు, అల్లర్లను గుర్తు చేసుకున్నారు. గురువులను గౌరవించుకున్నారు. ఇటువంటి ఎన్నో జ్ఞాపకాలను మదిలోనూ.. మొబైల్‌ఫోన్లలోనూ పదిలం చేసుకున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో ఫొటోలు, రీల్స్‌ రూపంలో చక్కర్లు కొట్టించేస్తున్నారు. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను వీడి వెళ్లలేక వెళుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా తిరుగుపయనమవుతున్నారు.

తిరుగు ప్రయాణికులతో జిల్లాలోని బస్టాండ్లు, ప్రైవేట్‌ బస్సులు ఆగే ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రం అమలాపురం, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు ప్రధాన బస్టాండ్లు శనివారం రాత్రి నుంచి ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌ వంటి నగరాలకే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప, శ్రీకాకుళం వెళ్లే వారితో వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు సరిపోక పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్‌ బస్సులు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లే దారిలో అమలాపురం ఈదరపల్లి వంతెన, చిన్న వంతెన, పేరూరు ఎత్తురోడ్డు, ముమ్మిడివరం, మురమళ్ల సెంటరు, కొత్తపేట పాత బస్టాండ్‌, రావులపాలెం సెంటరు, ఆలమూరు జొన్నాడ సెంటర్లు ప్రయాణికులు వారిని దిగబెట్టేందుకు వచ్చిన బంధుమిత్రులతో కిటకిటలాడుతున్నాయి.

ఈ గాలీ.. ఈ నేల.. ఈ ఊరు.. సెలయేరు.. ననుగన్న నావాళ్లు.. నా కళ్ల లోగిళ్లు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పదాలు పల్లెల ప్రశస్తిని పెంచేవే. పెద్ద పండగ సంక్రాంతి మూడు రోజులపాటు సాగే పెద్ద ఉత్సవం. పట్టణాలకు.. నగరాలకు ఉదర పోషణకు వెళ్లిన ఈ ప్రకృతి ముద్దు బిడ్డలు ఈ పండగకు సొంతూళ్లకు వస్తున్నారంటే అందుకు ఎంతో ముందస్తు ప్రణాళిక వేసుకుంటారు. ‘ఒరేయ్‌ నువ్వొస్తున్నావా.. ఆడొస్తున్నాడా.. ఎహే.. పన్లేంట్రా.. ఆణ్ణీ ఆళ్లావిడ పిల్లల్నీ తీసుకుని రమ్మన్రా.. మళ్లీ ఎప్పటికో కలుస్తాం..’ ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ ఎన్ని ప్రసారమై ఉంటాయో.. గంపెడు పిల్లలున్న కుటుంబాలకు పల్లెల్లో కొదవులేదు. వారంతా పిల్లాజెల్లలతో అవకాశం ఉంటే వారి కుక్కపిల్లలతో సహా వచ్చి వారం రోజుల పాటు వారి వారి ఇళ్లల్లో ముచ్చట్లు.. మురిపాలు.. అల్లుళ్లు.. సందళ్లు.. ముగ్గులు నిండిన ముంగిళ్లు.. సంప్రదాయ పిండి వంటలు.. కోడి పందేలు.. చెరకు తోటల్లో తిరుగుళ్లు ఒకటేమిటి.. పుడమి పులకించిపోయేలా సందడిగా గడిపారు. పండగ సెలవులు గడిచిపోయాయి. చెమర్చిన కళ్లతో.. వీడి వెళ్లలేని వీడ్కోళ్లతో పల్లె బిడ్డలు పట్టణాలకు పయనమై వెళ్లిపోయారు. పల్లెల్లోని ఇళ్లన్నీ బోసిపోగా.. ఎవరి పనులు వారు చక్కబెట్టుకుంటున్నారు.

వీడలేక.. వెళ్లలేక వీడ్కోలు

చెప్తున్న ఆత్మీయులు

ముగిసిన సంక్రాంతి సెలవులు

ఉద్యోగ, వ్యాపారాల కోసం తిరుగు పయనం

ఆది, సోమవారాల్లో పెద్ద ఎత్తున

తరలి వెళ్తున్న ప్రయాణికులు

బోసిపోయిన పల్లెలు

వస్తాం.. మళ్లొస్తాం!1
1/2

వస్తాం.. మళ్లొస్తాం!

వస్తాం.. మళ్లొస్తాం!2
2/2

వస్తాం.. మళ్లొస్తాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement