విద్యుత్‌కు జలసత్వాలు
మోతుగూడెం: తెలుగు రాష్ట్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తికి పొల్లూరు జల విద్యుత్ కేంద్రం చిరునామాగా నిలిచింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన చర్యలతో దీని సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ విద్యుత్ విప్లవానికి సిద్ధమవుతోంది. ఇక్కడ ఇప్పటికే నాలుగు యూనిట్లు ఉండగా, 5, 6 యూనిట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రంలో పాత యూనిట్లు, కొత్త నిర్మాణాలకు మధ్య అనుసంధాన పనులు చేపట్టేందుకు సుమారు 45 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. ఇటు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం నుంచి ఫోర్‌బై రిజర్వాయర్ వరకూ సుమారు 16 కిలోమీటర్ల మేర పవర్ కెనాల్ కాంక్రీట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పవర్ కెనాల్‌కు సంబంధించి సైడ్ ప్యానళ్ల ప్లాస్టరింగ్‌తో పాటు కాంక్రీటింగ్, గ్రౌటింగ్ పనులు సుమారు రూ.1.50 కోట్లతో 20 మంది కాంట్రాక్టర్లు చేస్తున్నారు. పవర్ కెనాల్ పనులు రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటు 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు జరుగుతున్నాయి. ఫోర్‌బై జలాశయం అండర్‌గ్రౌండ్ టన్నెల్ వద్ద వికెట్ గేట్ల పనులు దాదాపు పూర్తి కానున్నాయి. దీంతో పాటు పవర్ హౌస్ వద్ద ఉన్న సర్జ్ ట్యాంక్‌లో నూతన గేట్ల నిర్మాణం పూర్తి కావొచ్చింది. వాల్వ్ హౌస్ వద్ద బటర్‌ఫ్లై వాల్వ్‌ను కొత్తగా నిర్మించిన పెన్‌స్టాక్ పైప్‌లైన్‌కు అనుసంధానించే కార్యక్రమం పూర్తవుతోంది. దీంతో పాటు పెన్‌స్టాక్ పైప్‌లైన్ వాల్వ్ హౌస్ నుంచి పవర్ హౌస్ దిగువన కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్లకు అనుసంధానం చేసే పనులు కూడా కొలిక్కి వస్తున్నాయి. పవర్ హౌస్ దిగువ భాగాన ట్రయల్ రేస్ సంపులో ఉన్న నీటిని పూర్తిగా తోడి, 5, 6 యూనిట్లకు అండర్ గ్రౌండ్‌లో డ్రాప్ ట్యూబ్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో అండర్‌గ్రౌండ్ డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు నిర్మించే ప్రాంతంలోని నీరు పవర్ హౌస్‌లోకి రాకుండా కాంక్రీటుతో పూర్తిగా మూసివేశారు. అయితే, అనుసంధాన పనులు చేస్తూండటంతో ఈ కాంక్రీట్ వాల్‌ను పగులగొట్టి డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజులుగా ఈ అనుసంధాన పనులతో పాటు పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఒక యూనిట్‌లో ఓవర్ హాలింగ్ పనులను అభిరామ కంపెనీకి అప్పగించి సాంకేతికంగా సరి చేస్తున్నారు. దీంతో పాటు డొంకరాయి పవర్‌హౌస్‌లో ఉన్న 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ క్యాపిటల్ ఓవర్ హాలింగ్ పనులు రూ.28 లక్షలతో అభిరామ్ కంపెనీ ద్వారా నిర్వహిస్తున్నారు. మరో 45 రోజుల్లో క్యాపిటల్ ఓవర్ హాలింగ్ పనులు పూర్తి చేసుకుని జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిత్య జీవితంలో విద్యుత్ ఎంతో అవసరం. అలాంటి విద్యుత్ అవసరాలకు ఎలాంటి ఇబ్బందీ రాకూడదనే ముంపుచూపుతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020లో ఆలోచన చేసింది. ఇందులో భాగంగా పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకుంది. ఇక్కడ అదనంగా 5, 6 యూనిట్ల పనులు మొదలుపెట్టింది. దీనికి గాను రూ.536 కోట్లు కేటాయించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 80 శాతం పనులు జరిగాయి. కొద్ది రోజుల్లోనే ఈ పనులు పూర్తి కానున్నాయి. తద్వారా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు ఈ ప్రాజెక్టు మరింత ఆసరా కానుంది.
పెరగనున్న ఉత్పత్తి
ఏప్రిల్ నాటికి 5, 6 యూనిట్లలో ఒకటి పూర్తయితే పొల్లూరు జల విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి పెరగనుంది. ఈ నెల 25 లోపు అనుసంధాన పనులు పూర్తవుతాయి. పొల్లూరు జల విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యం 460 మెగావాట్లు. ఒక్కో యూనిట్ నుంచి 115 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కొత్తగా నిర్మించే 5, 6 యూనిట్లు పూర్తయితే అదనంగా మరో 230 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇలా ఈ కేంద్రం సామర్థ్యం మొత్తం 690 మెగావాట్లకు పెరగనుంది. ఈ యూనిట్ల నిర్మాణం, అనుసంధాన పనులపై ఏపీ జెన్‌కో హైడల్ డైరెక్టర్ సుజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారం రోజుల కిందట ఆయన పొల్లూరు, డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలను సందర్శించి పనుల పురోగతిపై సమీక్షించారు.
జల విద్యుత్‌కు చిరునామా ‘పొల్లూరు’
సామర్థ్యం పెంపునకు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే పనులు
త్వరలోనే అందుబాటులోకి రానున్న 5, 6 యూనిట్లు
తద్వారా రాష్ట్రంలో
మెరుగుపడనున్న సరఫరా
విద్యుత్‌కు జలసత్వాలు
విద్యుత్‌కు జలసత్వాలు
విద్యుత్‌కు జలసత్వాలు


