ఆ బడులు.. క్లోజ్!
డీఈవో పరిధిలో 12.. ఐటీడీఏ పరిధిలో 20 తాత్కాలికంగా మూసివేత విద్యార్థులు లేకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం యూడైస్ ప్రకారం తేటతెల్లం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేని బడులను మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. యూడైస్ ప్రకారం డీఈవో పరిధిలో 12, ఐటీడీఏ పరిధిలో 20 బడులు ఉన్నా యి. ఇటీవల విద్యా శాఖ ఒక్క విద్యార్థి లేని పాఠశాలను మూసివేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తర్వాత విద్యార్థులు చేరితే వాటిని మళ్లీ తెరవనున్నారు. ప్రభుత్వం బడిబాట కార్యక్రమంలో భాగంగా జీరో ఎన్‌రోల్‌మెంట్ బడులను తెరిచేందుకు చర్యలు చేపట్టినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. జిల్లాలో ఐదు పాఠశాలలను పునఃప్రారంభించారు. వివిధ కారణాలతో సర్కారు బడులకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూ పడం లేదని తెలుస్తోంది. చాలా చోట్ల ఉపాధ్యాయులు సైతం లేరు. ఉపాధ్యాయులు ఉండి విద్యార్థులు లేని పాఠశాలలను ఇతర బడులకు సర్దుబాటు చేశారు. ఇటీవల డైస్ ఆయా పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు, మౌలిక వసతులను సేకరించగా, ఈ విషయంపై స్పష్టత వచ్చింది.
తాత్కాలికంగా 32 మూసివేత..
జిల్లాలో మొత్తం 1,471 ఉపాఠశాలలు ఉండగా ఇందులో విద్యార్థుల సంఖ్య లేని 32 పాఠశాలలను ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసేందుకు నిర్ణయం తీసుకుంది. వీటిలో డీఈవోపరిధిలో పరిశీలిస్తే.. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాల భుక్తాపూర్, స్టేషన్ రోడ్, కేఆర్‌కే కాలనీ హిందీ మీడియం, బజార్‌హత్నూర్‌లోని ఇంద్రనగర్, బేలలోని దహెగాం ఉర్దూ మీడియం, భీంపూర్‌లోని పిప్పల్‌కోటి ఉర్దూ మీడియం, బోథ్‌లోని కరత్వాడ, గాదిగూడలోని చిన్నకుండి, కునికాస కేజీ, ఇచ్చోడలోని జెడ్పీఎస్‌ఎస్ తలమద్రి, నేరడిగొండలోని దాబా, సుర్దాపూర్ ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో భీమల్‌నాయక్‌తండా, భవానిగూడ, పర్దాన్‌గూడ, పూసంగూడ, సెంటర్ సాంగ్వి, చిన్నబెందార, గోవింద్‌పురం, ఇంకర్‌పల్లె, లక్ష్మిపూర్, సుద్దాపూర్, డొంగర్‌గాం బిటి, మారుతిగూడ, గోద్రుగూడ, నేరడిగొండ, జీడిపల్లె, లాల్‌షాగూడ, బుర్కపల్లి, పెండల్‌వాడ, ఇంద్రానగర్, బేతాల్‌గూడ, శివగూడ, మోరిపేట్, ఎల్లగూడ, భీంజిగూడ, నడ్డంగూడ, రాజంపేట్–గంగాపూర్ పాఠశాలలు ఉన్నాయి.
కారణాలెన్నో..
సర్కారు బడులు మూతబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ప్రత్యేక దృష్టి సారించింది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేసింది. అయినప్పటికీ డీఈవో పరిధిలోని దాదాపు 450 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. చాలా ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావడం లేదు. ఆర్థిక భారమైనప్పటికీ ప్రైవేట్‌లోనే చదివిస్తున్నారు. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం, ఏఐ ఆధారిత బోధన అందిస్తున్నప్పటికీ మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. దీంతోపాటు మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నట్లు సమాచారం.
ఐదు బడులు పునఃప్రారంభం..
జిల్లాలో డీఈవో పరిధిలో మూతపడ్డ ఐదు పాఠశాలలను ఈ ఏడాది పునఃప్రారంభించారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి బడిబాట కార్యక్రమంలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు చేపట్టారు. ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించడంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. జిల్లా కేంద్రంలోని వెంకట్రావ్ పాఠశాల, భీంపూర్ మండలంలోని డబ్బకుచ్చి, నార్నూర్‌లోని భీంపూర్ ఎస్టీ, కొత్తపల్లి, నేరడిగొండలోని సావర్గాం పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఉ పాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు దృష్టి సారిస్తే తప్పా ఈ మూతబడులు తెరుచుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తోంది.
జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు
పాఠశాలలు విద్యార్థులు
డీఈవో పరిధిలో 739 65వేలు
ఐటీడీఏ పరిధిలో 540 19,369


