పుస్తక పఠనంతో సామాజిక విలువలు
ఆదిలాబాద్: పుస్తక పఠనంతో వ్యక్తిలో సామాజిక విలువలు పెంపొందుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఆదివారం మరో గ్రంథాలయ ఉద్యమం కార్యక్రమంలో భాగంగా బాలల గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో పుస్తక పఠనం వ్యక్తిలో గొప్ప విలువలను పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. త్వరలో పార్కులో కళాభవన్ నిర్మాణం చేపట్టి, శాశ్వతంగా లైబ్రరీ నిర్మాణం చేస్తామన్నారు. లైబ్రరీ ఏర్పాటుకు పుస్తకాలు అందించిన బ్రేడ్ స్వచ్ఛంద సంస్థను ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, బ్రేడ్ సంస్థ ప్రతినిధి లింగయ్య, ప్రముఖ రచయితలు మురళీధర్, సామల రాజవర్ధన్, ఉదారి నారాయణ, ఏలీయా, ఆశన్న, చెకుముకి కన్వీనర్ సంతోష్ కుమార్, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ఉమాకాంత్, మరో గ్రంథాలయ ఉద్యమ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


