సమాజ భద్రతలో నేర నియంత్రణ కీలకం
ఆదిలాబాద్‌టౌన్: సమాజ భద్రతలో నేర నియంత్రణ కీలకమని, ప్రజల్లో పోలీసు కీర్తి, ప్రతిష్టలు మరింత పెరిగేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా టూటౌన్‌ను ఆదివారం తనిఖీ చేశారు. ఆవరణలో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి స్థితిగతులపై ఆరా తీశారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తూ, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. విధుల్లో చురుకుదనం, నిజాయతీ, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. పట్టణంలో రాత్రి వేళలో ఓపెన్ డ్రింకింగ్‌పై తనిఖీలు నిర్వహించాలన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టాలని పేర్కొన్నారు. స్టేషన్‌లో నమోదైన ప్రతీ కేసు వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి, పెండెన్సీ లేకుండా దర్యాప్తు పూర్తి చేసి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలు అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, టూటౌన్ సీఐ నాగరాజు, ఎస్సైలు పీర్ సింగ్ నాయక్, కె.విష్ణు ప్రకాష్, ఎంఏ. నజీబ్, సిబ్బంది ఉన్నారు.
పెరుగుతున్న ఏఐ ఆధారిత సైబర్ మోసాలు..
సైబర్ కేటుగాళ్లు నూతన పద్ధతుల్లో ప్రజలను మోసగిస్తున్నారని, ఇటీవల ఏఐ ఆధారిత వీడియో, మెస్సేజ్‌లతో మోసాలు పెరిగాయని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్థిక సైబర్ మోసాలకు గురైన వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నం.1930, జాతీయ సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పేర్కొన్నారు. మోసానికి గురైన గంటలోపు ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, తక్కువ పత్రాలతో ఎక్కువ లోన్ ఇస్తామంటూ నమ్మబలికే ప్రయత్నాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ వారం జిల్లాలో సైబర్ క్రైమ్ విభాగంలో 20 ఫిర్యాదులు నమోదైనట్లు వివరించారు.
ఇటీవల నమోదైన కేసులు..
రికార్డులు ఎప్పటికప్పుడు నవీకరించాలి
ఆదిలాబాద్‌టౌన్: రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ కార్యాలయాన్ని ఆదివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసుల స్థితిగతులు తెలుసుకున్నారు. ఈ ఏడాది సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న కేసుల వివరాలపై ఆరా తీశారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, నాగరాజు, కర్ర స్వామి, కార్యాలయ సిబ్బంది జైపాల్, రవి, గణేష్ సిబ్బంది తదితరులున్నారు.


