గూడు గోస
ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల అర్జీ ఆన్‌లైన్‌లో నమోదు మిస్సింగ్ అర్హుల జాబితాలో లేని పేర్లు ఆదిలాబాద్ బల్దియా నిర్వాకం వెలుగులోకి వస్తున్న లోపాలు
ఎంట్రీ మిస్సింగ్ కాదు
ప్రజాపాలన దరఖాస్తులో కొంతమంది సంక్షేమ పథకాల ఎంపిక వద్ద నమోదు సరిగా చేయకపోవడంతో వారికి ఆ పథకం దక్కని పరిస్థితి ఉంది. అంతే గాని దరఖాస్తు ఆన్‌లైన్ ఎంట్రీ మిస్సింగ్ అనేది జరగలేదు.– సీవీఎన్ రాజు,
మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చింది. అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకుని ఆశగా ఎదురుచూశా రు. అర్హుల జాబితాలో తమ పేరు వస్తుందని ఆశపడ్డారు. అయితే పలువురి దరఖాస్తులు ప్రజాపాలన పోర్టల్‌లో నమోదు కాలేదు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంటున్న దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో నమోదయ్యే అవకాశమే లేదని తెలుసుకుని నిరా శకు గురవుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇలాంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆశలు అడియాశలేనా..?
లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం ఎల్–1, ఎల్–2, ఎల్–3 విభాగాలుగా విభజించి ఇళ్ల నిర్మాణం చేపడుతూ వస్తోంది. స్థలం ఉండి ఇల్లు లేని వారిని ఎల్–1 కింద నమోదు చేసి వారితో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇల్లు, స్థలం రెండు లేనివారిని ఎల్–2లో నమోదు చేశారు. తదుపరి ప్రభుత్వం ఇలాంటి వారి విషయంలో ఏదైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే యోచనలో ఉంది. ఇక వివిధ కారణాలతో అనర్హులుగా ఎల్–3 జాబితా రూపొందించారు. అయితే ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పలువురికి సంబంధించి వివరా లు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో అసలు పథకానికి పూర్తిగా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నా యి. ఇలాంటి వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రా యం వారి నుంచి వ్యక్తమవుతోంది.
ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన చంద్రకళ ఇందిరమ్మ ఇంటి కోసం గతంలో దరఖాస్తు చేసుకుంది. ప్రజాపాలన పోర్టల్‌లో మున్సిపల్ అధికారులు ఈమె దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. అర్హుల జాబితాలో తన పేరుంటుందని ఆశించిన ఆమెకు చుక్కెదురైంది. దీంతో తాను దరఖాస్తు చేసుకున్న రశీదు తీసుకువచ్చి అధికారులను అడిగితే వారి నుంచి సరైన స్పందన లేదు. చంద్రకళతో పాటు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి సంబంధించి ఇలాగే ఆన్‌లైన్ ఎంట్రీ లేకపోవడంతో జాబితాలో వారి పేరు లేకుండా పోయింది.
గూడు గోస


