పత్తి ‘మద్దతు’లో కోత
ఆదిలాబాద్‌టౌన్: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది పత్తి రైతుల పరిస్థితి. సీసీఐ ఇప్పటికే తేమ పేరిట కొర్రీలు పెడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మద్దతు ధరలో క్వింటాలుకు రూ.50 కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చాలా మంది ధర పెరుగుతుందనే ఆశతో పత్తిని విక్రయించకుండా ఇళ్లలోనే నిల్వ ఉంచారు. అయితే తగ్గిన మద్దతు ధర ఈనెల 27 నుంచి అమలులోకి రానున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. పత్తి పింజ పొడవు తగ్గడంతో ధరలో కోత విధించినట్లు పేర్కొంటున్నారు. అయితే సీసీఐ నిర్ణయంతో తమకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యత పేరిట ధరలో కోత..
అక్టోబర్ 24న ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దాదాపు నెలరోజుల్లోనే సీసీఐ ధరలో కోత విధించింది. బోథ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, జైనథ్ మార్కెట్ యార్డుల్లో ఈనెల 6న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇంత త్వరగా నాణ్యత పేరిట కోత విధించడంపై రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పత్తికి మద్దతు ధర లభించడం లేదు. 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తోంది. ఇందులో 8 శాతం ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.8110 చెల్లిస్తుండగా, ఆ తర్వాత 9 నుంచి 12 శాతం వరకు ఉంటే ధరలో కోత విధిస్తున్నారు. నెలరోజుల్లోనే నాణ్యత పేరిట కోత విధిస్తుండగా, రానున్న రోజుల్లో మరింత కోత ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో..
ఇప్పటివరకు కొనుగోలు చేసిన పత్తి :
1,90,804 క్వింటాళ్లు
సీసీఐ కొనుగోలు చేసిన పత్తి:
1,67,796 క్వింటాళ్లు
ప్రైవేట్ కొనుగోలు చేసిన పత్తి:
28,008 క్వింటాళ్లు
ప్రస్తుత మద్దతు ధర : రూ.8,110
ఈనెల 27 నుంచి అమలులోకి రానున్న ధర: రూ.8,060
రేపటి నుంచి మద్దతు ధర రూ.8,060
ఈనెల 27 నుంచి క్వింటాలు పత్తి ధర రూ.8,060తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సీసీఐ వారు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చే పత్తిని శాంపిల్ చేశారు. ల్యాబ్‌కు టెస్ట్ కోసం పంపించారు. పింజపొడవు 29.1 నుంచి 29.49 ఎంఎం తక్కువగా రావడంతో ధరలో కోత విధించారు. రైతులు ఇంటివద్దనే ఆరబెట్టి నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకురావాలి.
– గజానంద్, మార్కెటింగ్ ఏడీ


