మరుగున పడేశారు..! | - | Sakshi
Sakshi News home page

మరుగున పడేశారు..!

Nov 26 2025 6:47 AM | Updated on Nov 26 2025 6:47 AM

మరుగున పడేశారు..!

మరుగున పడేశారు..!

● రూ.2.56 కోట్ల ప్రజాధనం వృథా ● నిలిచిన మానవ వ్యర్థాల ఎరువుల తయారీ ● అలంకారప్రాయంగా ఎఫ్‌ఎస్‌టీపీ

కై లాస్‌నగర్‌: మానవ విసర్జిత వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువుగా ఉపయోగించాలనే ఉద్దేశంతో మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎఫ్‌ఎస్‌టీపీ) నిరుపయోగంగా మారింది. కాంట్రాక్టర్‌ పట్టించుకోకపోవడంతో పాటు పర్యవేక్షించాల్సిన బల్దియా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో ఈ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యాయి. ఆరంభం నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో కేవలం కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకే ప్లాంట్‌ను ఏర్పాటు చేశారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లక్ష్యం ఘనం.. ఆచరణలో విఫలం

పట్టణంలోని ఇళ్లలో గల సెఫ్టిక్‌ ట్యాంకుల్లో సేకరించిన మానవ వ్యర్థాల(మలం)ను ట్యాంకర్ల నిర్వాహకులు తీసుకెళ్లి ఊరి బయట పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత పరిసరాలు కంపుకొడుతున్నాయి. వ ర్షాలు కురిసిన సమయంలో నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. ఈ పరిస్థితిని గమనించిన బల్దియా మలంతో సేంద్రియ ఎరువు తయారు చేయాలని నిర్ణయించింది. దానిని పొలాలు, మొక్కల పెంపకానికి సరఫరా చేస్తూ అదనపు ఆదాయం గడించాలనే ఉద్దేశంతో పట్టణంలోని బంగారుగూడ డంపింగ్‌యార్డులో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించారు. 90వేల లీటర్ల వ్యర్థాలు నిల్వచేసే సామర్థ్యంతో కూడిన ట్యాంక్‌, ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేశారు. సెప్టిక్‌ ట్యాంకుల ద్వారా వచ్చే వ్యర్థాలను అందులో శుద్ది చేసి నీటిని మొక్కలకు వినియోగిస్తారు. శుద్ధి చేసిన మలాన్ని ప్రత్యేక షెడ్డులో15 రోజుల పాటు ఎండబెడుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా సోలార్‌ విద్యుత్‌ సౌకర్యం కూడా కల్పించారు. పూర్తిగా ఎండిన తరువాత పొడి చేసి పంటలకు ఎరువు కోసం తరలిస్తారు. రూ.2.56 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను 2021 ఆగస్టు 17న అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. 2022 డిసెంబర్‌ 18 వరకు విద్యు త్‌ సరఫరా లేకపోవడంతో తయారీ షురూ కాలేదు. సుమారు 16 నెలల తర్వాత ఈ ప్లాంట్‌ కోసం ప్ర త్యేకంగా హై టెన్షన్‌ లైన్‌ (హెచ్‌టీ) ఏర్పాటు చేశా రు. ఆ తర్వాత రెండు రోజులు మాత్రమే ఎరువుల తయారీని చేపట్టారు.

ఆది నుంచి అలంకారప్రాయమే

ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతను బీఓటీ పద్ధతిన భారత్‌ ప్రెస్టిన్‌ ఇన్‌ఫ్రా అనే సంస్థకు అప్పగించారు. 2023 డిసెంబర్‌లో విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి రావడంతో సేంద్రియ ఎరువుల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించారు. 25 కిలోలకు ఒక బ్యాగ్‌ చొప్పున ప్యాకింగ్‌ చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టారు. ఇది కేవలం రెండు రోజులకే పరిమితమైంది. నిర్వహణ లాభసాటిగా లేదనుకున్నారో లేక ఇతర కారణాలేంటో తెలి యదు కానీ కాంట్రాక్టర్‌ అప్పటి నుంచి కేంద్రాన్ని నిర్వహించడం నిలిపివేశారు. దీంతో నాలుగేళ్లుగా ఈ కేంద్రానికి తాళం వేసి ఉండడంతో అలంకారప్రాయంగా మారింది. మరోవైపు ఈ ప్లాంట్‌ కోసం ప్రత్యేకంగా హై టెన్షన్‌ లైన్‌ (హెచ్‌టీ) ఏర్పాటుతో విద్యుత్‌ బిల్లు నెలకు రూ.లక్షకుపై గానే వస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకు సంబంధించిన బిల్లులు రూ.లక్షల్లో పేరుకుపోయి బల్దియాకు అదనపు భారంగా మారాయి తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదు. అందుబాటులోకి తీసుకురావాల్సిన బల్దియా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యంత్రం చెడిపోవడంతోనే..

కొద్ది రోజుల పాటు ఎరువుల తయారీ జరిగింది. అయితే యంత్రం చెడిపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది. బాగు చేసి తయారీని ప్రారంభించాలని సంబంధిత ఏజెన్సీకి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. విషయాన్ని మున్సిపల్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూస్తాం.

– అవికిరణ్‌, బల్దియా పర్యావరణ ఇంజినీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement