
‘రెవెన్యూ’పై ఫోకస్
కై లాస్‌నగర్: జిల్లా పాలనలో కీలకమైన రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక దృష్టి సారించారు. తన మార్కు పాలనతో అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ధరణి ఆపరేటర్లపై ఇటీవల బదిలీ వేటు వేయగా, తాజాగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే మీ సేవ ఆపరేటర్లకు సైతం స్థానచలనం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ‘మామూలు’గా వ్యవహరిస్తున్న తహసీల్దార్లపై కూడా బదిలీ వేటు తప్పదనే ప్రచారం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.
అవినీతికి ఆస్కారం లేకుండా...
పాలనాపరంగా కీలకమైన రెవెన్యూ శాఖను సంస్కరించే దిశగా కలెక్టర్ ఫోకస్ పెట్టారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారనే కారణంతో జిల్లాలోని ధరణి ఆపరేటర్లపై ఇటీవల బదిలీ వేటు వేశారు. తాజాగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే మీసేవ ఆపరేటర్లను సైతం మూకుమ్మడిగా బదిలీ చేశారు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయడంతో పాటు తహసీల్దార్ డొంగల్ తమ వద్దే ఉంచుకుని అక్రమాలకు పాల్పడినట్లు వారిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇటీవల చేపట్టిన రేషన్‌కార్డుల జారీలోనూ దళారులతో కుమ్మకై ్క పనికో రేటు చొప్పున వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వారిపై బదిలీ వేటు వేసారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
తదుపరి వంతు తహసీల్దార్లదేనా..?
కలెక్టర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలపై అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ధరణి, మీ సేవ ఆపరేటర్లను బదిలీ చేయగా తదుపరి వంతు తహసీల్దార్లదేననే చర్చ ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో కొంత మంది మండల రెవెన్యూ అధికారులు అక్రమాలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి రైతుల నుంచి పెద్ద మొత్తంలోనే వసూళ్లను దండుకుంటున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి అధికారుల వ్యవహార శైలీ, పనితీరుపై జిల్లా బాస్ అంతర్గతంగా వివరాలు సేకరించినట్లుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే పలువురు తహసీల్దార్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారణకు వచ్చారని, త్వరలోనే వారిపై బదిలీ వేటు పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వినాయక చవితి పండగ తర్వాత ఏ క్షణమైనా బదిలీ వేటు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు రెవెన్యూలో అవినీతికి ఆస్కారం లేకుండా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది.