
75 మంది టీచర్లకు పదోన్నతి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం పదోన్నతుల ద్వారా భర్తీ చేసింది. ఇందులో భాగంగా 75 మంది ఎస్జీటీలకు ప్రమోషన్ లభించింది. జిల్లాలో మొత్తం 137 పోస్టులు ఖాళీగా ఉండగా, ఆయా కేటగిరీల్లో అర్హత గల ఉపాధ్యాయులు లేకపోవడంతో పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. సోమవారం ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ ఇవ్వగా, మంగళవారం ఉదయం పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులను విద్య శాఖ అధికారులు జారీ చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలో 8 మందికి, లోకల్ బాడీలో 67 మందికి పదోన్నతి లభించింది. ప్రభుత్వ యాజమాన్యంలో తెలుగు మీడియంలో ఇద్దరికి పీఎస్ హెచ్‌ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్ గణితంలో 1, సాంఘిక శాస్త్రం 1, హిందీ మీడియంలో సాంఘిక శాస్త్రం 1, ఉర్దూ మీడియంలో సాంఘిక శాస్త్రం 1, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌లో ఇద్దరికి పదోన్నతులు లభించాయి. లోకల్‌బాడీలో 28 మందికి పీఎస్ హెచ్‌ఎంలుగా, నలుగురికి స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 12, గణితంలో 4, బయోసైన్స్‌లో 5, ఫిజికల్ సైన్స్ 2, సాంఘిక శాస్త్రం 19, ఫిజికల్ ఎడ్యూకేషన్‌లో ఒకరికి పదోన్నతులు లభించాయి. కాగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రిపోర్టు చేసి విధుల్లో చేరారు.