
‘పంట నష్టంపై విపక్షాలది అనవసర రాద్ధాంతం’
కై లాస్‌నగర్: జిల్లాలో పంటనష్టంపై బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నా రు. పట్టణంలోని ప్రజాసేవభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కురిసినవర్షాలకు జిల్లాలో దాదాపు 20వేల ఎకరాల మేర పంట నష్టం వాటిల్లిందన్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల పర్యటించారన్నారు. నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారన్నారు. అయినా బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గతంలో ఇలాంటి వైపరీత్యాల సమయంలో గత పాలకులు రైతులను కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.