
ఎలుగుబంటి దాడిలో కూలీకి గాయాలు
తిర్యాణి(ఆసిఫాబాద్): ఎలుగుబంటి దాడిలో ఓ వ్యవసాయ దినసరి కూలీకి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామానికి చెందిన ఆవుల భూమయ్య వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పశువుల కాపరి వేరే ఊరికి వెళ్లడంతో భూమయ్య సోమవారం పశువుల మేపేందుకు ఎదులపహాడ్ బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పొదల్లో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా భూమయ్యపై దాడి చేసింది. దీంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి అరుపులు విన్న సమీపంలోని పాటగూడ గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రుడిని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.