
బీపీఎంలకు కొత్త ఫోన్లు
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత (చేయూత) కింద లబ్ధిదారులకు ప్రతీ నెలా పింఛన్ పంపిణీ చేస్తోంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ల (బీపీఎం) ద్వారా వీటిని అందజేస్తారు. ఈ మేరకు బీపీఎంలకు కొత్త సెల్‌ఫోన్లను అందించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 579 ఆండ్రాయిడ్ మొబైల్స్ సరఫరా చేసింది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. వాటిని మంగళవారం ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలో అందజేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఈ ఫోన్లు పింఛన్ పంపిణీకి మాత్రమే ఉపయోగపడతాయి.
అక్రమాలు అరికట్టేలా ...
వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, బోధకాలు, హెచ్‌ఐవీ బాధితులకు ప్రభుత్వం ప్రతినెలా చేయూత కింద పింఛన్లు అందజేస్తోంది. దివ్యాంగులకు రూ.3,016 అందిస్తుండగా, మిగతా వారికి రూ.2,016లను అందజేస్తోంది. పంపిణీలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గత నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. యాప్ ద్వారా లబ్ధిదారుల కళ్లను స్కాన్ చేసి పింఛన్ అందజేస్తున్నారు. సిబ్బందికి గత నెలలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన సెల్‌ఫోన్లు అందించాల్సి ఉండగా ఆలస్యమైంది. ప్రస్తు తం కొత్త మొబైల్స్ జిల్లాలకు చేరగా వాటిని అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 579 మంది బీపీఎంలు చేయూత పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీరికి 5జీతో కూడిన సెల్‌ఫోన్లను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఆర్‌డీఏ కార్యాలయాలకు ఈ ఫోన్లు చేరాయి. బీపీఎం పేరు, వారికి అందిస్తున్న ఫోన్ ఈఎంఐ నంబర్ వంటి వివరాలను ఆ శాఖ సిబ్బంది ఆన్‌లైన్‌లో నమో దు చేస్తున్నారు. మంగళవారం ఆయా కలెక్టర్ల ద్వా రా బీపీఎంలకు అందించనున్నారు. సెల్‌ఫోన్‌తో పాటు చార్జర్, బ్యాక్ కవర్, ఫింగర్ ప్రింట్స్ న మోదు చేసే యంత్రాన్ని సైతం అందజేస్తున్నట్లు డీఆర్డీవో రాథోడ్ రవీందర్ తెలిపారు. సెల్ ద్వారా పింఛన్‌దారు ముఖ చిత్రాన్ని స్కాన్ చేసి వారికి నగదు అందజేస్తారని పేర్కొన్నారు.
జిల్లా కేటాయించినసెల్‌ఫోన్లు
ఆదిలాబాద్ 158
నిర్మల్ 147
మంచిర్యాల 144
కుమురంభీం ఆసిఫాబాద్ 130