● గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్యాటకవీసాలపై నైపుణ్యరహిత పనుల్లో చేరిక ● చట్టాలపై అవగాహన లేక చేయని నేరానికి జైలుకు ● క్షేమసమాచారం తెలియక బాధిత కుటుంబసభ్యుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

● గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్యాటకవీసాలపై నైపుణ్యరహిత పనుల్లో చేరిక ● చట్టాలపై అవగాహన లేక చేయని నేరానికి జైలుకు ● క్షేమసమాచారం తెలియక బాధిత కుటుంబసభ్యుల ఆందోళన

Aug 12 2025 12:51 PM | Updated on Aug 12 2025 12:51 PM

● గల్

● గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్య

ఉపాధివేటలో ఆగిన గుండె

ఉజ్బెకిస్తాన్‌లో వలస కార్మికుడి మృతి

నిర్మల్‌ఖిల్లా: ఉపాధివేటలో విదేశాలకు పయనమైన జిల్లాకు చెందిన యువకుడి గుండె అక్కడే ఆగింది. దస్తూరాబాద్‌ మండలం మున్యాల్‌ గ్రామ పంచాయతీ పరిధి కొత్తపెద్దూర్‌ గ్రామానికి చెందిన సంగ సురేశ్‌ (33) ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గల్ఫ్‌ దేశం వెళ్లేందుకు సురేశ్‌ కడెం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన సబ్‌ ఏజెంట్‌ను సంప్రదించి రూ.2.50 లక్షలు ముట్టజెప్పాడు. సదరు సబ్‌ఏజెంటు మొదట 9 రోజులు ఢిల్లీలో ఉంచి అక్కడి నుంచి టూరిస్ట్‌ వీసా మీద ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంటుకు పంపాడు. అక్కడ క్లీనింగ్‌ పని కోసం 15 రోజులు శిక్షణ పొందాడు. అనంతరం డ్యూ టీలో చేరిన నాల్గొవ రోజు (గత నెల 21) గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో సురేశ్‌ మృతి చెందినట్లు కంపెనీప్రతినిధులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కాగా అక్కడి ఏజెంట్‌ మృతదేహాన్ని కార్గోలో పంపడానికి డబ్బు ఖర్చువుతుందని, ఢిల్లీ వరకు మాత్రమే పంపగలమ ని రోజుకో మాట చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు.

కలెక్టర్‌, రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ సభ్యులకు వినతి..

తాజాగా సోమవారం మృతుడి భార్య సంగ మమత, ఇద్దరు పిల్లలు, మామ జింక భూమన్నలతో కలిసివచ్చి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌కు సమస్య విన్నవించా రు. స్పందించిన కలెక్టర్‌ వివరాలు తీసుకొని మృతదేహం త్వరగా ఇండియా పంపేలా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అ నంతరం రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ స భ్యుడు స్వదేశ్‌ పర్కిపండ్లకు వివరాలతో కూ డిన పత్రాలు అందించి మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. ఏజెంట్‌కు కట్టిన నగదు తిరిగి ఇప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవించారు.

నిర్మల్‌ఖిల్లా: ఉన్న ఊరిలో పనులు లేక కుటుంబాలను పోషించుకునేందుకు గ్రామీణ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు దేశం కాని దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. కంపెనీ వీసాలు దొరక్క విజిట్‌ వీసాలపై వెళ్లిన వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఉపాధి వేటలో ఎలాగైనా గల్ఫ్‌ దేశం వెళ్లాలన్న యువకుల బలమైన కాంక్షను ఆసరాగా చేసుకున్న నకిలీ ఏజెంట్లు తాత్కాలిక, పర్యాటక వీసాలను అంటగట్టి రూ.లక్షలు దోచేస్తున్నారు. అలా వెళ్లిన జిల్లా వలస కార్మికులు నైపుణ్య రహిత పనుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. గల్ఫ్‌ దేశాల చట్టాల ప్రకారం వీసా లేకుండా పనిచేయడం నేరం కావడంతో అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వారి జాడ, క్షేమ సమాచారం స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియక తల్లడిల్లుతున్నారు. జిల్లాలో ఇలాంటి కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి.

నకిలీ ఏజెంట్ల వలలో చిక్కి..

కంపెనీ ఉద్యోగాల పేరిట అధిక వేతనాల ఆశ చూపుతూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెంట్లు గ్రామీణ మధ్యతరగతి యువతకు ఎరవేస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉన్నతంగా స్థిరపడిన వా రిని చూసి యువత తామూ అలాగే ఎదగొచ్చని ఆశపడుతూ అప్పుచేసి రూ.లక్షలు ముట్ట చెబుతున్నా రు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోతున్నా రు. గత ఆరు నెలల కాలంలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన జిల్లాకు చెందిన పలువురు యువకులు అక్కడి పోలీసులకు చిక్కడంతో ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు.

నైపుణ్య రహిత పనుల్లోనే..

విదేశాలకు వెళ్లాలన్న తపనతో రూ.లక్షలు వెచ్చించి అక్కడ నైపుణ్య రహిత పనులైన భవన నిర్మాణ రంగం, ఆఫీస్‌ బాయ్‌, క్లీనింగ్‌ తదితర పనులు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, ఉన్నతచదువులు లే కపోవడం, నైపుణ్య రంగాల్లో అనుభవం లేకపోవ డం కూడా ఇందుకు మరో కారణంగా గల్ఫ్‌ సంక్షేమ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా వివిధ వృత్తి పనుల్లో అనుభవం కలిగి ఉండాలని, అలాంటి పనుల నిమిత్తమే రిజిస్టర్డ్‌ ఏజెంట్ల ద్వారావిదేశాలకు ఉపాధి కోసం వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలు..

నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన పన్నాల శ్రీనివాస్‌ సౌదీ అరేబియా దేశం వెళ్లి గత మేలో పనిలో చేరాడు. అక్కడి యజమాని తన వ్యవసాయ క్షేత్రానికి పంపగా ఒకసారి భార్య పిల్లలకు ఫోన్‌ చేశాడు. అనంతరం అతని నుంచి ఇప్పటివరకు ఎటువంటి క్షేమ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సోన్‌ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన కిస్టాపురం లక్ష్మన్న సబ్‌ ఏజెంట్‌ ద్వా రా రూ.2లక్షలు వెచ్చించి దుబాయ్‌కి లేబర్‌ సప్లయ్‌ కంపెనీ వీసా ద్వారా వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సరైన వేతనం కూడా లేకపోవడంతో స్వదేశానికి రప్పించే ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు.

మామడ మండలం పరిమండల్‌ గ్రామానికి చెందిన గొర్రె రాజేందర్‌ ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఆయన వేతన ఖాతాలో అక్రమ నగదు బదిలీ కాగా కేసులో ఇరుక్కున్నాడు. స్వదేశానికి తిరిగి రాలేక అక్కడి పోలీసుల అదుపులో ఉన్నాడు. తమ కొడుకుని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని తండ్రి గంగన్న, కుటుంబ సభ్యులు కలెక్టర్‌ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు.

లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన సాయినాథ్‌, సారంగాపూర్‌ మండలం దేవితండాకు చెందిన జాదవ్‌ మధుకర్‌ గల్ఫ్‌ దేశాల్లో వివిధ రకాల కేసుల్లో ఇరుక్కొని అష్టకష్టాలు పడుతున్నారు.

కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గొర్రెకర్‌ శ్రీనివాస్‌ దుబాయ్‌లో సైబర్‌ నేరం కేసులో కటకటాలపాలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

నకిలీ ఏజెంట్లను నమ్మి విజిట్‌ వీసాలపై గల్ఫ్‌ దేశాలకు వెళ్లొద్దు. వృత్తిపరమైన శిక్షణతో కూడిన పనులకు మాత్రమే వెళ్లాలి. రిజిస్టర్డ్‌ ఏజెంట్లు, కంపెనీల ద్వారా వీసా రుసుము చెల్లించిన తర్వాతనే పయనమవ్వాలి. ప్రవాసీ భారత బీమా యోజన ఇన్సూరెన్స్‌ కలిగి ఉండాలి. గల్ఫ్‌ దేశాల నియమ, నిబంధనలు, చట్టాలు, సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి.

– మంద భీమ్‌రెడ్డి, ఎమిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరమ్‌ ప్రతినిధి, ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ వైస్‌చైర్మన్‌

● గల్ఫ్‌ దేశాలకు వెళ్లి  జిల్లా యువత అష్టకష్టాలు ● పర్య1
1/2

● గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్య

● గల్ఫ్‌ దేశాలకు వెళ్లి  జిల్లా యువత అష్టకష్టాలు ● పర్య2
2/2

● గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జిల్లా యువత అష్టకష్టాలు ● పర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement