
గోదావరి మింగింది..
● బాసర వద్ద నదిలో మునిగి ఇద్దరు మృతి ● అందరూ చూస్తుండగానే జల సమాధి ● మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల బాలుడు ● నిజామాబాద్ జిల్లాకు చెందిన మరోవ్యక్తి..
భైంసా:నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి సోమవారం ఇద్దరిని మింగింది. పుణ్యస్నానాలకు వచ్చిన 11 ఏళ్ల బాలుడు, 40 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. అంతా చూస్తుండగానే ఆయుష్షు తీరిపోయింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని పర్బని జిల్లా టాకిలి గ్రామానికి చెందిన కుల్దీప్ బాలాసాహెబ్ దేశ్‌ముఖ్ (11) తన తల్లిదండ్రులు, బంధువులతో కలిసి సోమవారం బాసరకు రైలు మార్గం ద్వారా చేరుకున్నాడు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఈ కుటుంబం, పుణ్యస్నానం కోసం గోదావరి తీరానికి వెళ్లింది. ఫిల్టర్ బెడ్ సమీపంలో ఈత కొట్టేందుకు నీటిలోకి దూకిన కుల్దీప్, లోతైన నీటిలో మునిగిపోయాడు. అతనితో ఉన్న మరో బాలుడిని స్థానికులు కాపాడారు. కుల్దీప్‌ను రక్షించలేకపోయారు. కుటుంబ సభ్యులు కేకలు వేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బాసర పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్లముందే కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి.
ఫంక్షన్ ముగించుకుని వచ్చిన వ్యక్తి..
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బొల్లమల రాజు(40) తన బంధువులతో కలిసి ఆదివారం ఇంట్లో ఒక కార్యక్రమం పూర్తి చేసుకుని, మరుసటి రోజు సోమవారం బాసరకు వచ్చాడు. కూలీపని చేస్తూ భార్య, పిల్లలను పోషిస్తున్న రాజు, అమ్మవారి దర్శనం తర్వాత గోదావరి నదిలో స్నానం చేయడానికి రెండో ఘాట్ వద్దకు వెళ్లాడు. ఈత రాకపోయినా.. కాళ్లు కడుక్కుంటానని నీటిలోకి దిగాడు. బంధువులు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే లోతైన నీటిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టినా మృతదేహం లభించలేదు. చివరకు అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. రాజు భార్య స్వరూప ఫిర్యాదు మేరకు బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలు అప్పగింత ఇద్దరు మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకే రోజు గోదావరి నదిలో ఇద్దరు భక్తులు జలసమాధి అవడం స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేసింది.

గోదావరి మింగింది..