వాల్మీకులు, బోయలపై వివక్ష ఇంకెన్నాళ్లు?
మదనపల్లె : ఆంధ్ర రాష్ట్రంలో వాల్మీకి బోయలపై వివక్ష ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని, వెంటనే మైదాన ప్రాంత వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (ఏపీవీబీఎస్) రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నాగినేని గోవిందు, యూత్ విభాగం అధ్యక్షుడు మహేష్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బొమ్మనపల్లి లక్ష్మన్న అన్నారు. సోమవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వాల్మీకుల ఐక్యత చాటుతూ ఈనెల 17వ తేదీన శ్రీ మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు గ్రామ గ్రామాన వాల్మీకి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆలయ చైర్మన్ పదవి వాల్మీకి బోయలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వాల్మీకి బోయలు కూటమి వైపు అండగా నిలిచి ఓట్లు వేశారని, కూటమి ప్రభుత్వం తమను నట్టేట ముంచవద్దని కోరారు. గిరిజన రిజర్వేషన్ల అంశంలో ఏ జాతికి లేని అశాసీ్త్రయమైన ఏజెన్సీ, మైదాన ప్రాంతం అనే నిబంధన వాల్మీకి బోయల రిజర్వేషన్ల అమలులో మాత్రం ఎందుకని ప్రశ్నించారు. వాల్మీకుల రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగాన్ని అనుసరించి అధికరణలు 14,15,16 , 29(1) 342లను అమలు పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.మల్లికార్జున, పరేసు గోపాల్, రాజగోపాల్, చెన్నం వెంకటరమణ, కొత్తూరు చిన్న రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.


