pochamma
-
‘పోచమ్మ’ వెబ్ సిరీస్ రివ్యూ
సిల్వర్‌స్క్రీన్ మీదే కాదు వెబ్ స్క్రీన్ మీద కూడా మైథలాజికల్ కంటెంట్‌కి కూడా రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి కథను చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద పిల్లల వరకు అందరూ ఆసక్తికరంగా చూస్తారు. అందుకే మన దర్శకనిర్మాతలు మైథలాజికల్ టచ్‌తో డిఫరెంట్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వెబ్ సిరీసే పోచమ్మ. అచ్యుత్ కుమార్, స్నేహల్ కామత్, అర్జున్ అంబటి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నేటి(ఏప్రిల్ 17) నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వ్యాపారవేత్త ఫెడ్రిక్(రమేశ్ ఇందిరా) అరకులో కొత్తగా ఓ కాఫీ ఎస్టేట్ కొనుగోలు చేస్తాడు. ఒకప్పటి ఆ ఎస్టేట్ ఓనర్ రఘుపతి(అచ్యుత్ కుమార్).. ఆర్థిక సమస్యలతో దాన్ని ఫెడ్రిక్‌కి అమ్మి, అందులోనే మేనేజర్‌గా పని చేస్తాడు. ఫెడ్రిక్ ఆ బంగ్లాలోకి రాగానే.. ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహాన్ని తీసేయిస్తాడు. ఆ తర్వాత వారింట్లో సమస్యలు మొదలవుతాయి. ఫెడ్రిక్ చిన్న కూతురు జెస్సీ(స్నేహల్ కామత్) అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. ఆమె చావుకు రఘుపతి కొడుకు సురేశ్ కారణమని ఫెడ్రిక్ పెద్ద కూతురు ఇవా(ప్రియా) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు మాత్రం ఈ హత్య వెనుక ఇవా భర్త డేవిడ్(అర్జున్ అంబటి) కూడా ఉన్నట్లు అనుమానిస్తారు. ఊరువాళ్లు మాత్రం పోచమ్మ విగ్రహం తొలగించినందుకే.. అమ్మ ఆగ్రహించి జెస్సీని చంపేసిందని నమ్ముతారు. అసలు జెస్సీ ఎలా చనిపోయింది? ఆమె చావుకు అసలు కారకులు ఎవరు? దేని కోసం చేశారు? పోచమ్మ విగ్రహం తొలగించిన తర్వాత ఫెడ్రిక్ ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? చివరకు ఫెడ్రిక్‌కి తెలిసిన నిజం ఏంటి? అనేది తెలియాలంటే ఆహాలో ‘పోచమ్మ’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇదొక మర్డర్ మిస్టరీ. దానికి మైథాలజీ ఎలిమెంట్‌ను యాడ్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సిరీస్‌ని తీర్చిదిద్డాదు దర్శకుడు రమేష్ ఇందిరా. తక్కువ నిడివితో మొత్తం ఐదు ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. జెస్సీ చనిపోయే సన్నివేశంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ మరణం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్..కథపై ఆసక్తిని పెంచుతుంది. జెస్సీ చావుకు కారణం ఏంటనేది చివరి వరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. రెండో ఎపిసోడ్లో కాస్త సాగదీత సన్నివేశాలు ఉన్నా.. పోచమ్మ విగ్రహాన్ని తొలగించే సీన్ మాత్రం కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొత్త కొత్త విషయాలు బయటకు రావడం.. మరోవైపు పోచమ్మకు సంబంధించిన సీన్లతో ఐదు ఎపిసోడ్లను ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. అయితే థ్రిల్లర్ సిరీస్‌లు చూసే ఆడియెన్స్ మాత్రం విలన్ ఎవరు అనేది ఈజీగానే కనిపెట్టగలరు. రూపాలు వేరైనా దేవుళ్లు అందరూ ఒక్కటే అంటూ సిరీస్‌ని ముగించిన తీరు బాగుంది. తెలుగువారికి పెద్దగా పరిచయం లేని నటీనటులు ఉండడం.. కథనం కొంతమేర ఊహకందేలా సాగడం ఈ సిరీస్‌కి మైనస్. అలాగే పోచమ్మకు సంబధించిన సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం ఈ సిరీస్‌కి ప్లస్ పాయింట్. థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారికి ‘పోచమ్మ’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సిరీస్‌కి రమేశ్ ఇందిరా దర్శకత్వం వహించడమే కాకుండా.. కీలకమైన ఫెడ్రిక్ పాత్రను కూడా పోషించాడు. కాఫీ ఎస్టెట్ ఓనర్‌గా ఆయన లుక్, బాడీ లాంగ్వేజీ చక్కగా కుదిరింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న డేవిడ్ పాత్రలో అర్జున్ అంబటి ఒదిగిపోయాడు. నిడివి తక్కువే అయినా.. ఆయన పాత్ర గుర్తిండిపోతుంది. ఇక జెన్సీగా స్నేహిల్ గ్లామర్‌గా కనిపిస్తూనే..తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇవా పాత్రకి ప్రియా న్యాయం చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అచ్యుత్ కుమార్ రోల్ గురించి. రఘుపతి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. చివరిలో ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. సాంకేతికంగా సిరీస్ బాగుంది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఓటీటీలోకి మిస్టీరియస్ థ్రిల్లర్ ‘పోచమ్మ’..ఎక్కడ? ఎప్పుడు?
అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘పోచమ్మ’. శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మించిన ఈ సిరీస్‌కి రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగా యాక్సెస్ పొందవచ్చు. బుధవారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నటుడు అంబటి అర్జున్ మాట్లాడుతూ ‘కొన్ని కంటెంట్ లు ముందు సైలెంట్ గా ఉంటాయి, కానీ రిలీజ్ అయ్యాక మంచి సౌండింగ్ చేస్తాయి. ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ లో అలాంటి కంటెంట్ ఉంది. పోస్టర్ , టైటిల్ తోనే మా సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సిరీస్ కు మా డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ హీరోలు. ఆహా టీమ్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సిరీస్ మన ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ లో ప్రతి ఆర్టిస్ట్ బాగా నటించారు. చిన్న పిల్లలు కూడా అద్భుతంగా నటించారు. ఇలాంటి మంచి సిరీస్ కు హడావుడి అవసరం లేదు స్ట్రీమింగ్ కాగానే సక్సెస్ అందుకుంటుంది. ఈ నెల 17న ఆహాలో మా ‘పోచమ్మ’ సిరీస్ తప్పకుండా చూడండి’అన్నారు.నటి స్నేహల్ కామత్ మాట్లాడుతూ - ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ జెస్సీ అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం చిక్ మంగళూరులో చేశాం. ఈ సిరీస్ కు నన్ను సెలెక్ట్ చేసుకున్న ప్రొడ్యూసర్ శృతి నాయుడుకి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే రమేష్ ఇందిర మంచి దర్శకుడి కాదు మంచి కోస్టార్ కూడా. నా కోస్టార్స్ అందరితో కలిసి నటించడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ ను మీరంతా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు.నటి శ్రీ పూజ మాట్లాడుతూ - ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న మొదటి రోజే తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మాను. ఎందుకంటే మా సిరీస్ కు పనిచేసిన వారంతా పని రాక్షసులు. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదు. ఈ సిరీస్ తమిళం, తెలుగులో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మిమ్మల్ని తప్పకుండా ఎంగేజ్ చేసేలా సిరీస్ ఉంటుంది’ అన్నారు.ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ - ‘పోచమ్మ’ కథ విన్నప్పుడే ఈ సిరీస్ సక్సెస్ మీద మాకు నమ్మకం ఏర్పడింది. ఈ సిరీస్ చిత్రీకరణ మొత్తాన్ని పోచమ్మ తల్లే ముందుండి నడిపించింది అనిపించింది. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా పోచమ్మ తల్లి గుడి, విగ్రహాలు మాకు ఎదురయ్యేవి. మా టీమ్ అంతా డిస్కస్ చేసుకుని సీన్స్ చేశాం. ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. మిమ్మల్ని ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉంటుంది’అన్నారు. -
హారర్ థ్రిల్లర్ తెలుగు సిరీస్.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీల్లో సినిమాలతో పాటే అప్పుడప్పుడు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలా మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన సిరీస్ 'పోచమ్మ'. ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం(ఏప్రిల్ 17) నుంచి తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఓ గ్రామంలోనే భవంతిలో అడ్డుగా ఉందని పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఊరిలోని వ్యక్తులపై పోచమ్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అనే బ్యాక్ డ్రాప్ స్టోరీతో సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, కన్నడ ప్రముఖ నటుడు అచ్యుత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ', 'బ్యాడ్ బాయ్ కార్తిక్', 'పాపం ప్రతాప్', 'తెరచాప' తదితర తెలుగు సినిమాలతో పాటు 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీ.. భూత్ బంగ్లా అనే హిందీ చిత్రం రాబోతున్నాయి. మన దగ్గర రిలీజయ్యేవన్నీ కూడా చిన్న మూవీస్, దానికి తోడు వేటిపైనా అస్సలు బజ్ లేదు.(ఇదీ చదవండి: నా కూతురి రూపంలో ఆమె తిరిగొచ్చింది.. పూర్ణ ఎమోషనల్)మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి సిద్ధమయ్యాయి. వీటిలో మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం వన్', యూత్, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', మృణాల్ ఠాకుర్ 'దో దివానే షెహర్ మై' మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు టోస్టర్ చిత్రం, పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు చూడొచ్చనేలా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 13 నుంచి 19వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్టోస్టర్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 15యూత్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 16ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు సినిమా) - ఏప్రిల్ 16బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16WWE రెజ్ల్ మేనియా 42 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16దో దివానే షెహర్ మే (హిందీ సినిమా) - ఏప్రిల్ 17ఏ గొరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 17అమెజాన్ ప్రైమ్ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) - ఏప్రిల్ 13యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 13అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 17హాట్స్టార్సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 15ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఏప్రిల్ 17ఆహాపోచమ్మ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 17జీ5రుబాబ్ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 14భానుప్రియ భూటేర్ హోటల్ (బెంగాలీ సినిమా) - ఏప్రిల్ 15ఆపిల్ టీవీ ప్లస్మార్గోస్ గాట్ మనీ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15లయన్స్ గేట్ ప్లేగుడ్ బాయ్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 17బుక్ మై షోద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 17(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్
ఓటీటీలు అనగానే చాలామంది థ్రిల్లర్సే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు ఇలాంటి కంటెంట్‌ని ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఓ సిరీస్ తీశారు. అదే 'పోచమ్మ'. దీని గ్లింప్స్‌ని 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సిరీస్ స్ట్రీమింగ్ తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన బండ్ల గణేశ్.. త్వరలో కూతురి పెళ్లి)సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ అంబటి అర్జున్ లీడ్ రోల్ చేస్తుండగా.. శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 17 నుంచి ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. శ్రుతి నాయుడు నిర్మించగా.. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. గ్లింప్స్ బట్టి చూస్తుంటే.. థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. పోచమ్మ దేవత గొప్పతనం, మహిమని అంచనా వేయక తప్పులు చేసే కొందరిని ఆమె ఎలా శిక్షించింది? తనను పూజించే వారిని ఎలా రక్షించింది? అనేది స్టోరీ అనిపిస్తుంది.పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు అనే డైలాగ్ ఈ సిరీస్ ఎలా ఉండబోతోంది అని తెలియజేస్తోంది.మిస్టికల్ థ్రిల్లర్ కంటెంట్ చూసే ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కనిపిస్తుంది.(ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'బ్యాంక్‌లోన్ కావాలా'! అంటూ.. భారీ మోసం! అసలేం జరిగిందంటే..?
మహబూబాబాద్: లోన్ పేరిట ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు ఆమె భర్త, కూతురు, మరో ఇద్దరు మోసం చేశారని, వీరిపై ఎస్పీ కరుణాకర్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు శనివారం తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం మహాముత్తారం మండలం మాదారానికి చెందిన పెరుమాండ్ల పోశమ్మ కాటారం మండల మేడిపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తోంది. పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలు, ఆమె భర్త పదే పదే బ్యాంక్‌లోన్ కావాలా అని అడేగేవారు. దీంతో రూ.2లక్షల లోన్ ఇప్పించమని కోరింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి భర్త మంథనికి తీసుకెళ్లి ధ్రువపత్రాలపై సంతకాలు తీసుకున్నారు. వారం తర్వాత గోదావరిఖని ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా రూ.6 లక్షల రుణం మంజూరైనట్లు తెలిపారు. బ్యాంక్ ద్వారా రూ.3 లక్షలు విత్‌డ్రా చేసుకోగా, మరో 3 లక్షలు అకౌంట్లో లేవు. దీనిపై సదరు ఉద్యోగి భర్తను నిలదీయగా తనకు సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సమస్య తలెత్తుతుందని బెదిరించడంతో మిన్నుండిపోయింది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం లోన్ ఈఎంఐ చెల్లించడం లేదని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు ఇంటికి రాగా విషయం బయటపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.6లక్షలతో పాటు బాధితురాలికి తెలియకుండా తన పేరిట సదరు ఉద్యోగి, ఆమె భర్త, తన కూతురు, మరో ఇద్దరు కాటారం ఎస్బీఐలో రూ.14 లక్షల లోన్ తీసుకున్నారు. బాధితురాలి చెక్కులను చోరీ చేసి లోన్ డబ్బును బ్యాంక్ నుంచి డ్రా చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోశమ్మ కోరారు. ఈ విషయమై కాటారం ఎస్బీఐ మేనేజర్ వెంకట్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా పోశమ్మకు తమ బ్యాంక్‌లో ఎలాంటి లోన్ లేదని తెలిపారు. -
రాచర్లగొల్లపల్లిలో తల్లీ కుమారుడి అదృశ్యం
కరీంనగర్: మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన తల్లీకుమారుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం.. రాచర్లగొల్లపల్లికి చెందిన కాటికాపల పోచమ్మ అనే యువతి గతేడాది భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి తన ఐదేళ్ల కుమారుడు కార్తీక్‌తో కలిసి తల్లిగారింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు బస్టాండ్‌లో పని ఉందని చెప్పి, కుమారుడిని తీసుకొని వెళ్లి, కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు రెండు రోజులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోచమ్మ తల్లి దుర్గవ్వ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, తల్లీకుమారుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పోచమ్మ బోనాల సందడి
-
పోచమ్మ ఆలయానికి తాళం వేసిన పోలీసులు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలోని పోచమ్మ ఆలయానికి పోలీసులు మంగళవారం తాళాలు వేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గ్రామ సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ కసూర్తి నరేందర్ మధ్య విబేధాలే తాజా పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఇరు వర్గాలూ దసరా ఉత్సవాల నిర్వహణకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ సోమవారం ఇరు వర్గాలతో సమావేశమయ్యారు. సర్పంచ్, మాజీ సర్పంచ్ వర్గాల నుంచి చెరో ఏడుగురు చొప్పున మొత్తం 14 మందితో కమిటీ వేసుకుని దసరా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్ ఏడుగురి పేర్లను ఇచ్చారు. అయితే, కస్తూరి నరేందర్ వర్గం నుంచి పేర్లను ప్రకటించలేదు. దీంతో పోచమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సర్పంచ్ సునీతా రాజ్‌కుమార్ వర్గీయులు సమాయత్తం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని తాళాలు వేశారు. మాజీ సర్పంచ్ వర్గీయులు కూడా వస్తే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే ప్రమాదం ఉందన్న ముందస్తు జాగ్రత్తతో చర్యలు తీసుకున్నారు. -
ఆటో-తవేరా ఢీ.. మహిళ మృతి
నిజామాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ సమీపంలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు.. నాగారం గ్రామానికి చెందిన పోచమ్మ(48) అనే మహిళ పచ్చకామెర్లకు మందు తీసుకోవడం కోసం ఎంచ గ్రామానికి ఆటోలో బయలుదేరింది. ఆటో అబ్బాపూర్ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న తవేరా వాహనం ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న పోచమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగ్రాతులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


