‘పోచమ్మ’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ | Pochamma Web Series Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘పోచమ్మ’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ : హత్యకు అమ్మవారికి సంబంధం ఉందా?

Apr 17 2026 4:33 PM | Updated on Apr 17 2026 5:41 PM

Pochamma Web Series Review And Rating In Telugu

సిల్వర్‌స్క్రీన్‌ మీదే కాదు వెబ్‌ స్క్రీన్‌ మీద కూడా మైథలాజికల్‌ కంటెంట్‌కి కూడా రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి కథను చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద పిల్లల వరకు అందరూ ఆసక్తికరంగా చూస్తారు. అందుకే మన దర్శకనిర్మాతలు మైథలాజికల్‌ టచ్‌తో డిఫరెంట్‌ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వెబ్‌ సిరీసే పోచమ్మ. అచ్యుత్ కుమార్‌, స్నేహ‌ల్ కామ‌త్‌, అర్జున్ అంబ‌టి కీల‌క పాత్ర‌ల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ నేటి(ఏప్రిల్‌ 17) నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
వ్యాపారవేత్త ఫెడ్రిక్‌(రమేశ్‌ ఇందిరా) అరకులో కొత్తగా ఓ కాఫీ ఎస్టేట్‌ కొనుగోలు చేస్తాడు. ఒకప్పటి ఆ ఎస్టేట్‌ ఓనర్‌ రఘుపతి(అచ్యుత్‌ కుమార్‌).. ఆర్థిక సమస్యలతో దాన్ని ఫెడ్రిక్‌కి అమ్మి, అందులోనే మేనేజర్‌గా పని చేస్తాడు. ఫెడ్రిక్‌ ఆ బంగ్లాలోకి రాగానే.. ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహాన్ని తీసేయిస్తాడు. ఆ తర్వాత వారింట్లో సమస్యలు మొదలవుతాయి. ఫెడ్రిక్‌ చిన్న కూతురు జెస్సీ(స్నేహల్‌ కామత్‌) అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. 

ఆమె చావుకు రఘుపతి కొడుకు సురేశ్ కారణమని ఫెడ్రిక్‌ పెద్ద కూతురు ఇవా(ప్రియా) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు మాత్రం ఈ హత్య వెనుక ఇవా భర్త డేవిడ్‌(అర్జున్‌ అంబటి) కూడా ఉన్నట్లు అనుమానిస్తారు. ఊరువాళ్లు మాత్రం పోచమ్మ విగ్రహం తొలగించినందుకే.. అమ్మ ఆగ్రహించి జెస్సీని చంపేసిందని నమ్ముతారు. అసలు జెస్సీ ఎలా చనిపోయింది? ఆమె చావుకు అసలు కారకులు ఎవరు? దేని కోసం చేశారు? పోచమ్మ విగ్రహం తొలగించిన తర్వాత ఫెడ్రిక్‌ ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? చివరకు ఫెడ్రిక్‌కి తెలిసిన నిజం ఏంటి? అనేది తెలియాలంటే ఆహాలో ‘పోచమ్మ’ సిరీస్‌ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
ఇదొక మర్డర్‌ మిస్టరీ. దానికి మైథాల‌జీ ఎలిమెంట్‌ను యాడ్‌ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సిరీస్‌ని తీర్చిదిద్డాదు దర్శకుడు రమేష్‌ ఇందిరా. తక్కువ నిడివితో మొత్తం ఐదు ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. జెస్సీ చనిపోయే సన్నివేశంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ మరణం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్‌..కథపై ఆసక్తిని పెంచుతుంది. జెస్సీ చావుకు కారణం ఏంటనేది చివరి వరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. రెండో ఎపిసోడ్‌లో కాస్త సాగదీత సన్నివేశాలు ఉన్నా.. పోచమ్మ విగ్రహాన్ని తొలగించే సీన్‌ మాత్రం కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. 

ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో కొత్త కొత్త విషయాలు బయటకు రావడం.. మరోవైపు పోచమ్మకు సంబంధించిన సీన్లతో ఐదు ఎపిసోడ్లను ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి.‍ అయితే థ్రిల్లర్‌ సిరీస్‌లు చూసే ఆడియెన్స్ మాత్రం విలన్‌ ఎవరు అనేది ఈజీగానే కనిపెట్టగలరు. రూపాలు వేరైనా దేవుళ్లు అంద‌రూ ఒక్క‌టే అంటూ సిరీస్‌ని ముగించిన తీరు బాగుంది. తెలుగువారికి పెద్దగా పరిచయం లేని నటీనటులు ఉండడం.. కథనం కొంతమేర ఊహకందేలా సాగడం ఈ సిరీస్‌కి మైనస్‌. అలాగే పోచమ్మకు సంబధించిన సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం  ఈ సిరీస్‌కి ప్లస్‌ పాయింట్‌. థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారికి ‘పోచమ్మ’ నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే..
ఈ సిరీస్‌కి రమేశ్‌ ఇందిరా దర్శకత్వం వహించడమే కాకుండా.. కీలకమైన ఫెడ్రిక్ పాత్రను కూడా పోషించాడు. కాఫీ ఎస్టెట్‌ ఓనర్‌గా ఆయన లుక్‌, బాడీ లాంగ్వేజీ చక్కగా కుదిరింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న డేవిడ్‌ పాత్రలో అర్జున్‌ అంబటి ఒదిగిపోయాడు. నిడివి తక్కువే అయినా.. ఆయన పాత్ర గుర్తిండిపోతుంది. ఇక జెన్సీగా స్నేహిల్‌ గ్లామర్‌గా కనిపిస్తూనే..తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇవా పాత్రకి ప్రియా న్యాయం చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అచ్యుత్‌ కుమార్‌ రోల్‌ గురించి. రఘుపతి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. చివరిలో ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది. సాంకేతికంగా సిరీస్‌ బాగుంది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement