లెక్కలేక.. కదల్లేక..

ap govt neglecting 108 vehicles - Sakshi

సంస్థమారినా గాడిలో పడని 108 వ్యవస్థ

ఇంజన్‌ ఆయిల్‌ మార్చడానికి నిధుల కొరత

టపాసుల్లా పేలిపోతున్న టైర్లు

తరచూ ఆగిపోతున్న వాహనాలు..

ఆటోల్లో వెళుతున్న బాధితులు

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

ఆపదలో ఉన్నవారిని ఆదుకొనే108 అంబులెన్స్‌ వాహనాలకు ‘నిధుల ప్రమాదం’ వెంటాడుతోంది.వాటి టైర్లు ఎక్కడ పడితే అక్కడ పగిలిపోతున్నాయి. పంక్చర్లు అవుతున్నాయి. దీంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.

కడప రూరల్‌:  
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల 108 వాహన వ్యవస్థ గాడిలో పడలేదు. రెండు రోజుల కిందట ఒక డెలివరీ కేసును హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి 108 వాహనం పోరుమామిళ్ల నుంచి కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి బయలుదేరింది. నరసాపురం వద్దకు వెళ్లగానే  మందు ఉన్న టైర్లు పగిలిపోయాయి. ఎంతసేపటికీ వాహనం రాకపోవడంతో ఆపదలో ఉన్న బాధితులు ఆటోలో సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లాల్సివచ్చింది. ఇలా  జరుగుతున్నాయి. ఈ వ్యవస్ధ జీవీకే నుంచి బీవీకేకు మారి నేటితో నెల అవుతుంది. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడం అందరినీ అందోళనకు గురిచేస్తోంది.

‘నిధుల ప్రమాదం’ ఇలా...
24 గంటల్లో ఒక వాహనానికి దాదాపు 15 కేసులు వస్తాయి. ఆ ప్రకారం కడప, ప్రొద్దుటూరు డివిజన్లలో రెండు బ్యాకప్‌ వాహనాలతో కలిపి మొత్తం 30 వాహనాలు ఉన్నాయి. ఇందులో 63 మంది పైలట్లు (డ్రైవర్లు), 58 మంది ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌)లు, ఇద్దరు డివిజన్‌ స్ధాయి ఈఎంటీలు పనిచేస్తున్నారు. గడిచిన 13వ తేదీన అర్ధరాత్రి ఈ వాహనాల బా«ధ్యతలను ప్రభుత్వం జీవీకే నుంచి బీవీజీ (భారత్‌ వికాస్‌ గ్రూప్‌)కు బదలాయించింది.  కాగా  రెండు వాహనాలకు సగటున ఐదుగురు టెక్నీషియన్స్, ఐదుగురు పైలెట్లు షిప్టుల ప్రకారం విధులు చేపడతారు. సిబ్బంది కొరత కారణంగా పని భారం ఎక్కువగా ఉందని సిబ్బంది వాపోతున్నారు.
             
ఈ వాహనాలు తిరగాలంటే బండ్లు కండీషన్‌లో ఉండాలి.  డీజిల్‌ సమస్య ఉండకూడదు. అయితే ఈ రెండు సమస్యలు   పట్టి పీడిస్తున్నాయి. డీజిల్‌కు నిధుల సమస్య  పరిష్కరిస్తామని యాజమాన్యం హమీ ఇచ్చింది. నిబంధనల ప్రకారం ఒక వాహనానికి నెలకు డీజల్‌ మరమ్మత్తులు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ 1.10 లక్షలు రావాల్సి ఉంది. గడిచిన ఆగస్టు నుంచి ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించలేదు. ఫలితంగా 12 వాహనాల  టైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంక్చర్లు అవుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. ఫలితంగా ఆపదలో ఉన్న బాధితులు 108కు ఫోన్‌ చేసినా వాహనం సమయానికి రావడంలేదు. 5 రోజుల క్రితం కడప కొత్త కలెక్టరేట్‌ కూడలి వద్ద ఒక ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. 108కు ఫోన్‌ చేస్తే ఎంతసేపటికీ   చేరుకోలేదు. .  65 వేల కిలోమీటర్లు తిరిగిన వాహనానికి  తప్పని సరిగా కొత్త టైర్లు అమర్చాలి.  అయితే లక్ష కిలోమీటర్లు పైబడి తిరిగినప్పటికీ టైర్లను మార్చలేని పరిస్ధితి ఏర్పడింది. అలాగే 1500 కిలో మీటర్లు తిరిగిన వాహనాలకు ఇంజిన్‌ ఆయిల్‌ మార్చాలి. అందుకు రూ 2 వేలకు పైగా ఖర్చు అవుతుంది. ఇంతవరకు చాలా వాహనాలకు ఇంజిన్‌ ఆయిల్‌ మార్చలేదు. అలాగే ఎమర్జెన్సీ మందులకు కూడా కొరత ఏర్పడింది. అదేవిధంగా ప్రొద్దుటూరు, రాజుపాలెం వాహనాలు నిలిచిపోయాయి.

ఎలాంటి సమస్యలు లేవు...
కొత్తగా బీవీకే యాజమాన్యం నెల కిందట బాధ్యతలు చేపట్టింది. నిధులకు ఎలాంటి కొరత లేదు. 108వాహనాలను విజయవంతంగా నడిపిస్తున్నాం.  – సంతోష్‌ 108 బీవీకే జిల్లా కో ఆర్డినేటర్‌

సమస్యలను పరిష్కరించాలి..
సంస్ధ మారడంతో పనిచేసే సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారింది. నిధులకు కొరత ఉంది. వాహనాలు కండీషన్‌లో ఉండేలా చర్యలు చేపట్టాలి. మొదటి నుంచి ఈ సంస్ధలో పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి.  – వీరమల్ల సాంబశివయ్య, జల్లా అధ్యక్షులు 108 ఈఎంటీ అసోషియేషన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top