జనంపై ‘రద్దు’ రుద్దుడు ఏల? | demonetization is issues for common people | Sakshi
Sakshi News home page

జనంపై ‘రద్దు’ రుద్దుడు ఏల?

Nov 23 2016 1:15 AM | Updated on Sep 27 2018 9:08 PM

జనంపై ‘రద్దు’ రుద్దుడు ఏల? - Sakshi

జనంపై ‘రద్దు’ రుద్దుడు ఏల?

పెద్ద నోట్ల రద్దు ఫలితంగా వైద్యం అందక కొందరు, మందు గోలీ కొనుక్కోలేక ఇంకొందరు పిచ్చి వాళ్లలా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు.

డేట్‌లైన్ హైదరాబాద్
పెద్ద నోట్ల రద్దు ఫలితంగా వైద్యం అందక కొందరు, మందు గోలీ కొనుక్కోలేక  ఇంకొందరు పిచ్చి వాళ్లలా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. సామాన్యుల ఇళ్లలో శుభకార్యాలన్నీ ఆగిపోయాయి. అధికారపక్ష పెద్దల, రాజకీయ నేతల ఇళ్లలో వందల కోట్ల ఖర్చుతో జరిగే పెళ్లిళ్లు, దావత్‌లు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే పెద్ద నోట్ల రద్దు ఎవరిని కట్టడి చెయ్యడానికి? అని అనుమానం కలుగుతోంది. రెండున్నరేళ్లలో చూపించలేని అచ్చే దిన్‌ను యాభై రోజుల్లో చూపిస్తాను అంటున్నారు ప్రధాని.
 
దేశంలో పెద్ద నోట్లు రద్దయ్యి సరిగ్గా రెండు వారాలు గడిచాయి. దేశమం తటా ప్రజలు రోడ్ల మీద, పాలకులు ఏసీ గదుల్లో, రాజకీయ పక్షాలు చట్ట సభల్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎవరి వాదన వాళ్లది. ప్రజలయితే కష్ట పడుతున్నారు. ప్రజలు తమను కష్టపెట్టడం కోసం ప్రభుత్వాలను ఎన్ను కోరు. తమను కష్టాల కడలి దాటిస్తారని నమ్మి రాజకీయ పార్టీలకు పట్టం కడతారు. అంతే కానీ తమ కష్టార్జితాన్నే లాగేసుకుని, దానికి లేనిపోని లెక్కలు అంట గట్టి, ఆ లెక్కలే సరిగా చెప్పకుంటే జైలులో పెడతామని బెదిరిస్తారని ఎవరు ఊహిస్తారు? పది శాతం కూడా లేని దొంగలను పట్టుకునే సమర్థ్ధత, వ్యూహాలు, ఎత్తుగడలు లేక... మిగిలిన 90 శాతం మందిపైన రాత్రికి రాత్రి తలా తోక లేని నిర్ణయాలను నెత్తిన బండ ఎత్తేసినట్టు విసురుతారని తెలిస్తే ప్రజలు వాళ్లకు ఓట్లేసి గద్దె మీద కూర్చోబెట్టరు కదా!

ప్రజలు కష్టపడు తున్నారని విపక్షాలు, ఇష్టపడుతున్నారని అధికార పక్షీయులు... ఎవరి వాదన వారు చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ నాయకుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, కవి గారు చెప్పినట్టు ‘‘ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖ పడాలి నంద నందనా’’ అన్న తీరున అచ్చే దిన్, అచ్చే దిన్ అని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఎటువంటి ‘అచ్చే దిన్’ ఇచ్చారో ఇవ్వాళ రోడ్ల మీద బారులు తీరిన సామాన్య ప్రజలను చూస్తే అర్థం అవుతుంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై క్యూ లైన్‌లలోనే మరణిస్తున్న వారిని చూస్తే తెలుస్తుంది. విపరీత పని భారంతో మానసిక ఒత్తిడికి గురయి చనిపోతున్న బ్యాంకు సిబ్బందిని చూస్తే అవగతమవుతుంది.
 
యాభై రోజుల్లో ‘అచ్చే దిన్’ వచ్చేనా?
సామాన్యుల ఇంట పెళ్లిళ్లు తదితర శుభకార్యాలన్నీ ఆగిపోయాయి. అధికార పక్ష పెద్దల, రాజకీయ నేతల ఇళ్లలో వందల కోట్ల ఖర్చుతో జరిగే పెళ్లిళ్లు, దావత్‌లు ఏ ఆటంకం లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు వారాల్లోనే మంచి ముహూర్తాలున్నాయని దేశమంతటా పెళ్లిళ్లు పెట్టుకున్నారు. పేదింటి పెళ్లిళ్లు ఆగిపోయారుు లేదా అరకొర ఏర్పాట్లతో అయిందని అనిపించు కున్నాయి. కలవారింటి పెళ్లిళ్లలో టన్నుల కొద్దీ ఖరీదయిన భోజనం వండి వార్చారు. వేల, లక్షల లీటర్ల స్కాచ్ విస్కీ ఏరులై పారింది. హైదరాబాద్‌లో గత వారం కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ నేత ఇంట జరిగిన పెళ్లి సందడిని చూస్తే... పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎవరిని కట్టడి చెయ్యడానికి? అని  అనుమానం కలిగింది.

చెల్లె పెళ్లి కోసం దాచుకున్న రూ. 50 వేల కోసం బిచ్చం ఎత్తుకున్నట్టు బ్యాంకు అధికారుల ముందు చేతులు జాపి ప్రాధేయ పడుతున్న ఒంటరి మహిళను కట్టడి చెయ్యడానికి ఇది ఉపయోగపడిందే తప్ప... పెళ్లి పేరిట కోట్లాది రూపాయలను స్కాచ్ విస్కీగా ప్రవహింప చేసిన సంపన్నుడిని మాత్రం ఏ ఇబ్బందీ పెట్టలేక పోయింది. వైద్యం అందక కొందరు, మందు గోలీ కొనుక్కునే చిల్లర దొరకక ఇంకొందరు పిచ్చి వాళ్ల లాగా రోడ్లు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. అచ్చే దిన్ ఎక్కడా అని సందు సందు వెతుకుతూనే ఉన్నారు . రెండున్నర సంవత్సరాల్లో చూపించలేని అచ్చే దిన్‌ను యాభై రోజులు ఆగండి చూపిస్తాను అంటున్నారు మన ప్రధాని.
 
సంచలన ప్రచారాలను నమ్మే, ఆచరించే విశ్వాసాలు పునాదిగా నడిచే రాజకీయాల నుండి ఎదిగిన వారు కాబట్టి ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. నిజంగా అశేష ప్రజానీకం ఈ నిర్ణయాన్ని ఇష్టంగా భరిస్తున్నారా? లేక ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా? తేల్చే పరీక్ష ఎన్నికలు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువు ఉన్నా రెండు, మూడు మాసాల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అది తేలిపోతుంది. మినీ భారత్‌గా భావించే ఉత్తరప్రదేశ్ కూడా ఆ ఐదింటిలో ఉంది. 2014 పార్ల మెంటు ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్నిచ్చిన రాష్ట్రమది. ఆ పార్టీ నాయ కత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి 2019 దాకా ఢోకా లేకపోయినా... ఉత్తర ప్రదేశ్ ఫలితాల ప్రభావం మాత్రం కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ భవి ష్యత్తును మాత్రం నిర్ణయిస్తుంది.
 
ఎవరి తీరు వారిది
 మోదీజీ రాజకీయ విశ్వాసాలే పునాదిగా అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల గురించి పెద్దగా మాట్లాడుకోవలసిన పని లేదు. ఇక గత 70 ఏళ్లలో అత్యధిక కాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు, వాటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడినా... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎదురు దాడి అస్త్రాన్ని ఎంచుకుంటోంది. కమ్యూనిస్ట్‌లు అధికారంలో ఉన్న రాష్ట్రాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సహజంగానే వాళ్లు ఈ నిర్ణయాన్నే కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ నిర్ణయాన్నయినా సిద్ధాంత రీత్యా వ్యతిరేకించవలసిందే. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టేతర రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ముఖ్య మంత్రులు ఈ వ్యవహారంలో ఏం చేస్తున్నారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసేసి చేతులు దులుపుకుంటాను అంటే కుదరదు.

దాని ఫలితాలు, మంచి చెడులు ప్రత్యక్ష ప్రభావం చూపేది రాష్ట్రాల మీద, వాటి ప్రభుత్వాల మీద. రాష్ట్రాల  సమాహారమే కేంద్రం. రాష్ట్రాలు లేకుండా కేంద్రం అనేది ప్రత్యేకంగా ఉండదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని ఆందోళన బాట పట్టారు కూడా. ఎన్‌డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తే, ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షం శివసేన వ్యతిరేకించింది.
 
కేసీఆర్ అభినందనీయుడు
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన వెంటనే ఆ చర్యను తీవ్రంగా విమర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కొద్ది సమయంలోనే తన స్వరాన్ని కొంత తగ్గించి ప్రధాన మంత్రిని కలవడానికి నేరుగా ఢిల్లీ పయనమయ్యారు. ఈ నిర్ణయం మీద తమ ప్రభుత్వ వైఖరి కేంద్రానికి తెలపడానికి ఢిల్లీ వెళ్ళిన తొలి ముఖ్య మంత్రిగా ఆయన కు మార్కులు వెయ్యాల్సిందే. చంద్రశేఖర్ రావు అటు ఎన్డీఏ కూటమికి గానీ ఇటు ఎన్డీఏ వ్యతిరేక కూటమికిగానీ చెందిన పార్టీ నేత కారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత ఈ రెండేళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి స్వతంత్రంగానే ఉంటూ వ చ్చింది. కేంద్రానికీ, రాష్ట్రానికీమధ్య ఉండే సంబంధాలే కొనసాగాయి. పైగా చంద్రశేఖర్ రావు ఎన్నడూ పెద్ద నోట్లు రద్దు చెయ్యండని కేంద్రాన్ని కోరిన నాయకుడూ కారు.

కాబట్టి తన రాష్ట్ర ప్రజల తరఫున ఆయన కేంద్రం దగ్గరికి వెళ్లి ఈ విషయంలో మాట్లా డిందంతా ఆయన అనుకూల ఖాతాలో జమవుతుంది. తాత్కాలికమో, దీర్ఘ కాలికమో ఏదరుుతేనేం దేశమంతా కేంద్ర నిర్ణయం వల్ల ఆర్థిక  ఇబ్బం దులను ఎదుర్కొంటున్నది. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలకూ డబ్బు కటకట తప్పదు. చంద్రశేఖర్ రావు ఢిల్లీ యాత్ర తెలంగాణ ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారాన్ని పెద్దగా ఏమీ సాధించినట్టు కనపడదు. అయితే లోపల ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఆయన చొరవ మాత్రం అభి నందనీయమే.
 
‘రద్దు’ అన్న బాబు నోట అసహనం మాట  
మరి ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే  రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చెయ్యాలని కోరుతూ మొట్ట మొదట ప్రధానికి లేఖ రాసింది ఆయనే. ఆ కోణంలో మాత్రమే కాకుండా ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్న పార్టీగా ఆయనేం చేస్తున్నారు? అనేదీ ముఖ్యమే. ఈ చర్య అనుకూల ఫలితాలను ఇచ్చి ఉంటే... ఇదంతా తన లేఖ కారణంగానే అని ఆయన తప్పక ప్రచారం చేసుకునేవారే. కానీ ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో ఈ నిర్ణయం తననే తీవ్ర అసహ నానికి గురి చేసిందన్నారు. అదే నిజమరుుతే అంత అసహనాన్ని రేకెత్తించే నిర్ణయం తీసుకోవాలని మోదీ మీద ఒత్తిడి తెస్తూ ఆయన ఆ లేఖను ఎందుకు రాసినట్టు? పదే పదే పెద్ద నోట్లను రద్దు చెయ్యాలని ఎందుకు కోరినట్టు? అని ప్రశ్నించకూడదు.

ప్రశ్నించే వాళ్ళంతా ఆయన దృష్టిలో ఉన్మాదులు, అభివృద్ధి వ్యతిరేకులు. ఈ విషయంలోనైతే జాతి వ్యతిరేకులు, దేశ ద్రోహులు అని కూడా అంటారేమో. పోనీ అదలా ఉంచితే ఈ విపత్తు వల్ల ప్రజలకు కలుగు తున్న కష్టాలను కడతేర్చడానికి ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ల లేదు,  ప్రధానితో ఎందుకు మాట్లాడలేదు. మాట వినకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఎందుకు ఉపసంహరించలేదు? ఆయన అమరావతి నుండే అన్నీ చక్కబెడుతున్నారని తెలుగుదేశం నాయకులు దబాయించేస్తారు. పోనీ అది నిజమే అయితే మరి ఫలితాలేవి? ఏపీలో కూడా జనం బ్యాంకుల చుట్టూ తిరుగు తూనే ఉన్నారు, నానా కష్టాలూ అనుభవిస్తూనే ఉన్నారు.
 
ఆయన ఎప్పుడయినా అంతే. రాష్ట్రాన్ని విడగొట్టండి అని కేంద్రానికి లేఖ రాస్తారు, ఇంకా ఆలస్యం ఎందుకు శాసనసభలో విభజన తీర్మానం పెట్టండి అని నిలదీస్తారు. తీరా నిర్ణయం జరిగిపోయాక ఎవరిని అడిగి చేశారీ పని? అని కళ్లు ఎర్ర చేస్తారు. ఏపీకి పదిహేనేళ్ల పాటూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటారు. కుదరదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంటే అమరావతిలో చంద్రబాబు నాయుడు రక్తం సలసలా కాగిపోతుంది. అయినా ప్రత్యేక ప్యాకేజీతోనే సర్దుకుపోతారు.
 

చంద్రబాబుకు తీవ్ర అసహనం కలిగినా, ఆయన రక్తం సలసలా మరి గినా ఆయన్ను చల్లగా చల్లార్చే మంత్రం మోదీ దగ్గర ఎలాగూ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈలోగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నగదు రహిత, కార్డు సహిత జీవితాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో పాఠాలు చెబుతూ ఉంటారు.
 

దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement