
భద్రతా వలయంలో శ్రీనగర్
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ లో అసాధారణరీతిలో భద్రత ఏర్పాటు చేశారు.
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ లో అసాధారణరీతిలో భద్రత ఏర్పాటు చేశారు. మోదీ సోమవారం బహిరంగసభలో పాల్గొననున్నారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రహదారులపైకి భారీస్థాయిలో భద్రతా బలగాలను తరలించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను, పాదచారులను ఎవరినీ వదలకుండా తనిఖీలు చేస్తున్నారు.
శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇంత భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయలేదని పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కశ్మీర్ లో మొదటిసారిగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ జరగనున్న షేర్-ఈ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంను ఇప్పటికే భద్రతా బలగాలు తమ చేతుల్లోకి తీసుకున్నాయి.