సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురు | Supreme Court dismisses Ramoji Rao's plea seeking stay on High court verdict | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురు

Feb 3 2014 3:15 PM | Updated on Sep 2 2018 5:20 PM

సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురు - Sakshi

సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది.

న్యూఢిల్లీ : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టులో  చుక్కెదురు అయ్యింది. రామోజీరావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. విశాఖపట్నం సీతమ్మధార స్థలం అద్దెకేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అద్దె బకాయిల పిటిషన్ తేలేంతవరకూ స్థల యజమాని మంతెన ఆదిత్యవర్మకు నెలకు రూ. 17 లక్షల చొప్పున  అద్దె చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే దీంతోపాటు అద్దె బకాయి  రూ.2.60 కోట్ల అద్దె బకాయిని చెల్లించాలని స్పష్టం చేసింది. దీనికి రామోజీరావు రెండు నెలలు గడువు కోరిగా, గడువు ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు నిరాకరించింది.


వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 1974, మార్చి 30న రామోజీరావు 2.78 ఎకరాల స్థలం, 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 ఏళ్ల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. అద్దె గడువు 2007 ఏప్రిల్‌తో ముగిసిన పిదప లీజు పొడిగించడానికి వర్మ తిరస్కరించడంతో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. మరోవైపు లీజు సమయంలో రూ. 2,500 అద్దె, కొన్నేళ్ల తరువాత రూ.3వేలు చెల్లించాలన్న ఒప్పం దం ప్రకారం అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ విశాఖలోని అద్దె నియంత్రణ చట్టం ప్రత్యేక కోర్టు (ఆర్‌సీసీ)ని ఆశ్రయించారు. నెల రోజుల్లో భవనం ఖాళీ చేసి యజమానికి అప్పగించాలని కోర్టు రామోజీరావును ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.

ఈ తీర్పుపై రామోజీరావు అప్పీల్ చేయగా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆర్‌సీసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ స్టేను తొలగించాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయిం చారు. ముంబై, హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో అద్దెలు పెరగడంపై ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం ప్రతిని కూడా హైకోర్టు ముందు ఉంచారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి... దిగువ కోర్టులో స్టే కొనసాగాలంటే ప్రస్తుత స్థలం విలువపై ఐదు శాతం అద్దెను ప్రతీనెల చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖలోని సీతమ్మధార ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి రూ. 30 వేలు పైచిలుకు ఉన్న ప్రకా రం ప్రస్తుతం స్థలం విలువ రూ. 40,36,50,000గా, భవనాల విలువ రూ. 90 లక్షలుగా లెక్కించారు.

ఆ ఆస్తులను వాణిజ్య అవసరాలకు తీసుకున్న రామోజీరావు స్థల యజమాని వర్మకు రూ.17లక్షల చొప్పున ప్రతినెల 10లోపు అద్దె చెల్లించాలని, అద్దె బకాయిలు రూ. 2.57 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ  రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రాథమిక విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న రామోజీరావు అభ్యర్థనను తిరస్కరించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement