నోట్ల రద్దు: సర్‌ప్రైజ్‌ల శక్తికాంత | Secretary Economic Affairs, Shaktikanta Das plays key role in Demonetisation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు: సర్‌ప్రైజ్‌ల శక్తికాంత

Nov 18 2016 11:04 AM | Updated on Aug 15 2018 6:34 PM

నోట్ల రద్దు: సర్‌ప్రైజ్‌ల శక్తికాంత - Sakshi

నోట్ల రద్దు: సర్‌ప్రైజ్‌ల శక్తికాంత

సంచలనాత్మక నోట్ల రద్దుకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లు, కొత్త నోట్లు, సంక్షోభ నివారణా చర్యలు, సోషల్ మీడియా వదంతులు.. అన్నింటిపై ఆయన ఒక్కరే మాట్లాడుతున్నారు..

న్యూఢిల్లీ: చేసింది చిన్న పనే అయినా ప్రెస్‌మీట్లు పెట్టి జబ్బలు చరుకునే మంత్రులు.. గడిచిన పది రోజులుగా మీడియాకు ముఖం చాటేస్తున్నారు. నోట్ల రద్దు, అనంతర పరిణామాలపై మాట్లాడేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ మాట్లాడినా ‘ప్రధాని నిర్ణయం అద్భుతం’ అంటారేతప్ప దేశంలో నెలకొన్న కల్లోల పరిస్థితులు, ప్రజల వెతలు, వాటి నివారణా చర్యలపై పెదవి విప్పడంలేదు. మూకుమ్మడిగా.. ‘అంతా ఆయనే చూసుకుంటారు..’అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. నిజమే, సంచలనాత్మక నోట్ల రద్దు నిర్ణయం, దానికి సంబంధించిన సర్‌ప్రైజ్‌లు, కొత్త నోట్ల విడుదల, సంక్షోభ నివారణా చర్యలు, సోషల్ మీడియా వదంతులకు సమాధానం.. అన్ని విషయాలపై ఆయన ప్రకటనలను దేశం మొత్తం ఆసక్తిగా వింటోంది..

నవంబర్‌ 8 రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేస్తున్నట్లు బాంబు పేల్చారు. ప్రధాని ప్రసంగం పూర్తయిన కొన్ని నిమిషాలకే ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మరో ప్రెస్‌మీట్ జరిగింది. అప్పటికే పేలిన నోట్ల బాంబు ప్రభావం నుంచి దేశప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన బాధ్యతను ఇద్దరు వ్యక్తులు నెత్తికెత్తుకున్నారు. వారిలో ఒకరు రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కాగా, రెండో వ్యక్తి కేంద్ర ఆర్థిక వ్యవహరాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్‌. కోట్లాది మంది వీక్షించిన నాటి మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్‌ ను సైతం డామినేట్‌ చేస్తూ, మైక్‌ లాక్కొనిమరీ నోట్ల రద్దు సర్‌ప్రైజ్‌ లు వెల్లడిస్తూ.. నాన్‌ ఐఏఎస్‌ (ఉర్జిత్ పటేల్‌) కంటే, విషయపరిజ్ఞానం తనకే ఎక్కువని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి  శక్తికాంత దాస్‌ నిరూపించుకున్నారు.

అన్నీ సర్‌ప్రైజ్‌ లే..
‘విదేశాల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కో భారతీయుడి అకౌంట్ లో రూ.15 లక్షలు జమ చేస్తా’నన్న మోదీ ఎన్నికల హామీ అమలులోనూ శక్తికాంత దాస్‌ ది కీలక పాత్ర పోషించారు. విదేశాల నుంచి వెలికితీసే ఇండియాకు తీసుకొచ్చే నల్లధనానికి శక్తికాంతే సంరక్షుడు(కస్టోడియన్‌)గా పనిచేశారు. నల్లధనం వెలికితీతపై ఏర్పాటైన షా కమిషన్‌ కు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగానూ శక్తికాంత వ్యవహరించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఆర్థిక శాఖలోని కీలకవిభాగమైన రెవెన్యూ వ్యవహారాల కార్యదర్శిగా ఆయన ఆ బాధ్యతలు నిర్వహించారు.  అప్పటివరకు విదేశీ నల్లధనం వెలికితీతకు పనిచేసిన దాస్‌.. 2015, సెప్టెంబర్ 1న ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైనప్పటి నుంచి స్వదేశీ నల్లధనంపై దృష్టిసారించారు. నల్ల వ్యవహారాల్లో ఆయనకు అంత పట్టుంది కాబట్టే నోట్ల రద్దు తర్వాత నిర్ణయాలు వెల్లడించాల్సిన భారానాన్ని కూడా ప్రభుత్వం దాస్‌ పైన మోపింది. (శక్తికాంత వెల్లడించిన కీలక నిర్ణయాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఢిల్లీ సెయిట్‌ స్టీఫెన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టాపుచ్చుకున్న శక్తికాంత దాస్‌.. తమిళనాడు క్యాడర్‌ ఐఏఎస్(1980 బ్యాచ్‌) అధికారి. స్వస్థలం ఒడిశా. 2009లో కేంద్ర సర్వీసుకు బదిలీ అయ్యేనాటికి తమిళనాడు  పరిశ్రమల శాఖలో పలు కీలక పదవులు నిర్వహించారు. ఎల్‌ఐసీ, ఓఎన్‌జీసీ లాంటి కీలక సంస్థలకు డైరెక్టర్ గా పనిచేశారు. ఆర్థిక శాఖలో సంయుక్త కాదర్శిగా చేరి, రెవెన్యూ విభాగాధిపతిగా విదేశీ నల్లధనం వెలికితీతపై పనిచేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న దాస్‌.. వచ్చే ఏడది(2017) ఫిబ్రవరిలో రిటైర్‌ కానున్నారు.

వివాదాలు.. స్వామి టార్గెట్లలో ఒకరు..
ఆర్థిక వ్యవహారాల్లో విశేష అనుభవమున్న శక్తికాంత్ దాస్‌ పై వివాదాలూ తక్కువేంకాదు. ఆర్మీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ను తొలగించాలంటూ తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి టార్గెట్‌ లిస్టులో శక్తికాంత పేరు కూడా ఉంది. మహాబలిపురం(తమిళనాడు)లోని ఓ భారీ ఆస్తి విక్రయంలో శక్తికాంత.. మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదంపై నమోదయిన కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఈ మేరకు కేసు ఎదుర్కొంటున్న శక్తికాంతను కేంద్ర సర్వీసుల నుంచి తొలిగించాలని, తిరిగి తమిళనాడుకు పంపేయాలని సుబ్రహ్మణ్య స్వామి జనవరిలో డిమాండ్‌ చేశారు. అయితే ప్రధాని మోదీ అండగా నిలవడంతో శక్తికాంత దాస్‌ నిరాటంకంగా తన పనితాను చేసుకుపోతున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement