గడచిన ఐదునెలల్లో లీటరుపై రూ.3.05 తగ్గిన పెట్రోల్ ధర | Petrol price cut by Rs 3.05 per litre; diesel hiked by 50 paise | Sakshi
Sakshi News home page

గడచిన ఐదునెలల్లో లీటరుపై రూ.3.05 తగ్గిన పెట్రోల్ ధర

Oct 1 2013 2:37 AM | Updated on Sep 28 2018 3:22 PM

గడచిన ఐదునెలల్లో లీటరుపై రూ.3.05 తగ్గిన పెట్రోల్ ధర - Sakshi

గడచిన ఐదునెలల్లో లీటరుపై రూ.3.05 తగ్గిన పెట్రోల్ ధర

వాహనదారులకు స్వల్ప ఊరట. పెట్రోలు ధరలు లీటరుపై రూ.3.05 మేరకు తగ్గాయి. అయితే, డీజిలు ధరలు లీటరుకు 50 పైసల మేరకు పెరిగాయి.

న్యూఢిల్లీ: వాహనదారులకు స్వల్ప ఊరట. పెట్రోలు ధరలు లీటరుపై రూ.3.05 మేరకు తగ్గాయి. అయితే, డీజిలు ధరలు లీటరుకు 50 పైసల మేరకు పెరిగాయి. స్థానిక పన్నులు లేదా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మినహా ‘పెట్రో’ ధరల్లో మార్పులను ఇంధన సంస్థలు సోమవారం ప్రకటించాయి. ధరల్లో మార్పులు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలు ధర తగ్గడం గడచిన ఐదునెలల్లో ఇదే తొలిసారి కాగా, ఇంత భారీగా తగ్గుదల చోటు చేసుకోవడం గడచిన ఐదేళ్లలో ఇదే ప్రథమం. అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి బలపడటంతో పెట్రోలు ధర తగ్గింపు సాధ్యమైంది. అయితే, నష్టాలను పూడ్చుకునేందుకు డీజిలు ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు వెల్లడించాయి.
 
 ఢిల్లీలో రూ.3.66 తగ్గింపు తర్వాత పెట్రోలు ధర లీటరు రూ.72.40 కానుంది. ఈ ఏడాది జూన్ నుంచి పెట్రోలు ధరలు ఏడుసార్లు పెరిగాయి. దీంతో, పెట్రోలు ధరలు లీటరుకు రూ.10.80 (వ్యాట్, స్థానిక పన్నులు కలిపి రూ.13.06) మేరకు పెరిగాయి. పేరుకుపోతున్న నష్టాలను తగ్గించుకునేందుకు డీజిలు ధరలను స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం ఇంధన సంస్థలకు అనుమతించిన నేపథ్యంలో, డీజిలు ధరలను లీటరుకు 50 పైసల మేరకు (పన్నులు మినహా) పెంచారు. ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు 57 పైసలు పెరిగి రూ.52.54కు చేరుకుంది.
 
 ఈ ఏడాది డీజిలు ధర పెరగడం ఇది తొమ్మిదోసారి. డాలరు దెబ్బకు డీజిలు అమ్మకాలపై నష్టాలు లీటరుకు రూ.14.50 వరకు చేరుకున్నాయి. రూపాయి తిరిగి బలపడటంతో నష్టాల మొత్తం రూ.10.52 మేరకు తగ్గాయి. కాగా, ఈ ఏడాది డీజిలు ధరలు మొత్తం రూ.5.39 మేరకు పెరిగాయి. ఇక సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ల ధరలను కూడా చమురు కంపెనీలు పెంచాయి. ఢిల్లీలో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరలను రూ.71.50 మేరకు పెంచడంతో రూ.1004కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 117 డాలర్లుగా ఉన్న ముడి చమురు బ్యారెల్ ధర 113 డాలర్లకు తగ్గడంతో పాటు 66 రూపాయలు ఉన్న డాలరు విలువ రూపాయి బలపడటంతో 63 రూపాయలకు తగ్గిన ఫలితంగా పెట్రోలు ధరలను తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement