పాకిస్థాన్ ఎదురుదాడి! | Pakistan diplomatic offensive against India in Kashmir issue | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ ఎదురుదాడి!

Aug 27 2016 6:08 PM | Updated on Sep 4 2017 11:10 AM

పాకిస్థాన్ ఎదురుదాడి!

పాకిస్థాన్ ఎదురుదాడి!

కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ దూకుడు పెంచింది. భారత్పై దౌత్యపరమైన ఎదురుదాడిని ఉధృతం చేసింది.

ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ దూకుడు పెంచింది. భారత్పై దౌత్యపరమైన ఎదురుదాడిని ఉధృతం చేసింది. కశ్మీర్పై ద్వంద్వవైఖరి అవలంభిస్తున్నదంటూ భారత్ను విమర్శించడమేకాక, ఆ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పాలని నిర్ణయించుకున్నది. ఈ క్రమంలోనే ప్రధాని నవాజ్ షరీఫ్.. 22 మంది ప్రత్యేక ప్రతినిధులను ఎంపిక చేశారు. వారంతా ప్రపంచంలోని ముఖ్యనగరాలకు వెళ్లి భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టేలా పావులు కదుపుతున్నారు.ఇస్లామాబాద్ లోని ప్రధాని కార్యాలయ వర్గాలు ఇలా పేర్కొన్నాయి..

పాకిస్థాన్ పార్లమెంటేరియన్లలో 22 మంది ఎంపీలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఎన్నుకున్నారు. త్వరలోనే ప్రపంచదేశాలకు వెళ్లనున్న ఆ బృందం.. కశ్మీర్ అంశంలో భారత్ తీరును ఆయా దేశాలకు తెలియజేస్తుంది. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి నివేదించిన భారతే, నాటి తీర్మానాలను ఖాతరు చేయడంలేదనే విషయాన్ని ఎత్తిచూపనున్నారు. సెప్టెంబర్ లో ఐక్యరాజ్యసమితి సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అంతకు ముందే ఎంపీల బృందం ప్రపంచ పర్యటనను పూర్తిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. తద్వారా న్యూయార్క్ లో నవాజ్ షరీఫ్ భారత్ కు వ్యతిరేకంగా చేయబోయే ప్రసంగానికి మద్దతు కూడగట్టాలని పాక్ ప్రభుత్వం భావిస్తున్నది.

ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో తలెత్తిన ఆందోళనలు 50 రోజులైనా తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనల్లో ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోగా, మూడువేల మందికిపైగా గాయపడ్డారు. పాక్ ప్రోద్బలంతోనే అల్లర్లు జరుగుతున్నాయన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రపంచవేదికలపై దాయాది దమననీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపైనే తప్ప కశ్మీర్ గురించి మాట్లాడేదిలేదని తేల్చిచెప్పారు. దీంతో పాకిస్థాన్ భారత్ కు వ్యతిరేకంగా పావులు కదిపేందుకు సిద్ధమైంది.

Advertisement
 
Advertisement
Advertisement